హైస్కూల్ నుంచే వాణిజ్య వేత్తలుగా ఎదగాలి

హైస్కూల్ నుంచే వాణిజ్య వేత్తలుగా ఎదగాలి

Updated On : June 21, 2021 / 3:59 PM IST

హైస్కూల్‌ స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామికవేత్తలుగా (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌) ఎదగాలనే ఆలోచన తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పుడే ఉద్యోగాల కోసం ఎదురుచూడటం కాకుండా ఉద్యోగాలు కల్పించేస్థాయికి విద్యార్దులు చేరుకొంటారని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ అద్భుతంగా పనిచేస్తున్నదని ఆయన చెప్పారు. శనివారం తెలంగాణ ప్రభుత్వ సహకారంతో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఏర్పాటుచేసిన సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రైన్యూర్‌షిప్‌ అండ్‌ స్టార్టప్స్‌ను మంత్రి కేటీఆర్‌ వెబినార్‌ ద్వారా ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో స్టార్టప్‌ల పాత్ర ప్రముఖమైనదని అన్నారు. ఇక్కడి స్టార్టప్‌లు ప్రపంచంలోని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయని, ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ అనుబంధరంగాల్లో స్టార్టప్‌లకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, మంచి వృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మనిర్భర్‌ భారత్‌ కావాలని పిలుపునిచ్చారని, స్టార్టప్‌లు లేకుండా ఆత్మనిర్భర్‌ భారత్‌ అసాధ్యమని స్పష్టంచేశారు. స్టార్టప్‌లకు అవసరమైన ఏకో సిస్టం ఉండాలని, దీనికి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ చాలా ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణలో స్టార్టప్‌ ఏకో సిస్టం దేశంలోనే టాప్‌-3లో ఒకటిగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ అనేక ఇంక్యుబెటర్లు, కోవర్క్‌ స్పేస్‌లు, యాక్సిలేటర్లు ఉన్నాయని, స్టార్టప్‌లకు మెంటర్స్‌, అడ్వయిజర్స్‌, ఇన్వెస్టర్స్‌, వెంచర్‌ ఫండ్స్‌ అనేకం దీనికి ముడిపడి ఉంటాయని చెప్పారు.

ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, స్టార్టప్‌లకు సీఐఐ ఏర్పాటుచేసిన ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రైన్యూర్‌షిప్‌ అండ్‌ స్టార్టప్స్‌ సెంటర్‌ మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో శానిటేషన్‌ హబ్‌ (ఎస్‌ హబ్‌ ) ఏర్పాటుచేస్తున్నామని, మరికొద్ది నెలల్లో దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైప్‌ సెంటర్‌ టీవర్క్స్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు.

కోరనా వ్యాక్సిన్ తెలంగాణ నుంచే
కరోనా కష్టకాలంలో స్టార్టప్‌ల సహకారంతో ఇక్కడ వెంటిలేటర్‌ను తయారుచేశామని, ఆస్పత్రులు దీనిని పరీక్షించాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొనడానికి దేశంనుంచి ఆరు సంస్థలు పోటీపడుతుంటే.. ఇందులో నాలుగు సంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్నవేనని ఆయన పేర్కొన్నారు.

కరోనాకు వ్యాక్సిన్‌ ఇక్కడినుంచే వస్తుందని దీమా వ్యక్తంచేశారు. ప్రపంచానికి అవసరమైన 35-40 శాతం వరకు ఫార్మా, వ్యాక్సిన్లు ఇక్కడ తయారై ఎగుమతి అవుతున్నాయని, లైఫ్‌ సైన్సెస్‌కు ఇక్కడ అనుకూల వాతావరణం ఉన్నదని చెప్పారు.

ఐటీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించినట్టుగానే దశాబ్దకాలంలో వైద్యరంగంలోనూ లభించబోతున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇందులో అద్భుతమైన అవకాశాలున్నాయని తెలిపారు. ఐటీ, హెల్త్‌ కేర్‌ రెండు కలిసి ప్రపంచంలోని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతాయన్నారు. నోవార్టిస్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో ఉన్నదని, రెండో పెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసి 5వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు.