TGPSC Group-3 Exam
TGPSC Group-3 Exam : తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 1,365 గ్రూప్-3 సర్వీసుల పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి. ఆదివారం రెండు పేపర్లకు సంబంధించిన పరీక్షలు జరిగాయి. అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు టీజీపీఎస్సీ 1,401 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేయడంతోపాటు 144 సెక్షన్ అమల్లోకి ఉంది. అయితే, సోమవారం రెండోరోజు గ్రూప్ -3 పరీక్షలో మూడో పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పైన పరీక్ష జరగనుంది.
Also Read: TGPSC: నేడు, రేపు గ్రూప్-3 పరీక్షలు.. అరగంట ముందే మూతపడనున్న గేట్లు
గ్రూప్-3 పరీక్షలపై అభ్యర్థుల్లో ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోంది. గ్రూప్-3 పరీక్షకు మొత్తం 5,35,400 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకోగా.. పరీక్షలు రాసింది కేవలం 2, 72,173 మంది మాత్రమే. ఆదివారం ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 51.1 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరుకాగా.. పేపర్ -2 పరీక్షకు 50.2 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇవాళ పేపర్-3 పరీక్షకు హాజరు శాతం మరింత తగ్గే అవకాశం ఉంది.
ఆదివారం పరీక్షలకు అదిలాబాద్ జిల్లాలో (64.2శాతం) అత్యధికంగా అభ్యర్థులు హాజరు శాతం నమోదుకాగా.. హైదరాబాదులో (44శాతం) అత్యల్పంగా హాజరు శాతం నమోదైంది. ఇదిలాఉంటే.. గ్రూప్-3 పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంతరాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. గంటన్నర ముందు నుండే అధికారులు గ్రూప్ -3 పరీక్షలు రాసే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. పరీక్షకు అరగంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లను మూసివేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆలస్యంగా పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్న పలువురు అభ్యర్థులు వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది.