TGPSC: నేడు, రేపు గ్రూప్-3 పరీక్షలు.. అరగంట ముందే మూతపడనున్న గేట్లు
ఉద్యోగాల తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్ టికెట్లను, ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది.

TGPSC Group-3 Exam: తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 1,365 గ్రూప్-3 సర్వీసుల పోస్టుల భర్తీకి సంబంధించి ఇవాళ, రేపు (17,18 తేదీల్లో) రాత పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఇందుకు ఏర్పాట్లు చేసింది. గ్రూప్-3 పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.36లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారు పరీక్షలు రాసేందుకు 1401 కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు.
గ్రూప్-3 పరీక్షల్లో భాగంగా ఇవాళ (ఆదివారం) ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -1, అదేవిధంగా మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ -2 పరీక్ష జరగనుంది. 18వ తేదీ (సోమవారం) ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులను పరీక్ష సమయం కంటే గంటన్నర ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభ సమయానికి అర్ధగంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయడం జరుగుతుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
Also Read: ఈ చలికాలం చచ్చేంత డేంజర్..! వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఐఎండీ హెచ్చరికలు..
ఉద్యోగాల తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్ టికెట్లను, ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ ను మూడు పేపర్లకు ఉపయోగించాలని, డూప్లికేట్ హాల్ టికెట్లను జారీ చేయబోమని టీజీపీఎస్సీ పేర్కొంది. అదేవిధంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా చప్పల్స్ మాత్రమే ధరించాలి.. బూట్లు ధరించకూడదు.