Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం సంచలన వ్యాఖ్యలు.. ‘రూ. లక్షల కోట్ల ప్రజాధనం నీటి పాలు’
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేంద్రం ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది.
union government slams kaleshwaram project at rajya sabha
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాజెక్టు పేరు చెప్పి.. లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృథాగా నీటి పాలు చేశారంటూ స్వయంగా కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ సోమవారం రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం పేరు చెప్పి భారీ మొత్తం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణమన్నారు. బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలంటూ రాజ్యసభలో కేంద్రాన్ని కోరారు.
ఈ క్రమంలో జల్ శక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ ఈ అంశంపై స్పందిస్తూ.. లక్షల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారని వ్యాఖ్యానించారు. అలాగే అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై ఎన్డీఎస్ఏ (NDSA) ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను కేంద్ర బృందం అధ్యయనం చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం.. జల్ జీవన్ మిషన్ నిధుల వినియోగంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ పాటిల్ ధ్వజమెత్తారు. రాష్ట్రం వద్ద రూ. 873 కోట్లు ఉన్నాయని.. కానీ ఈ మూడేళ్లలో ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ. 194 కోట్లేనని ఆయన గుర్తు చేశారు. మూడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్క కొత్త స్కీమ్ ప్రతిపాదన కూడా రాలేదని విమర్శించారు. మరోవైపు తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
