అందుకే మహారాష్ట్రలో వాళ్లు విజయం సాధించారు: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
మహారాష్ట్ర ఎన్నికలు కార్పొరేట్ల డబ్బు ప్రవాహంతో నడిచాయని ఆరోపించారు.

Vh
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని కూటమి గెలుపుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాది కాదని ఆయన అన్నారు. ఈ విజయం అగ్ర వ్యాపారులైన అదాని, అంబానీదేనని ఆరోపించారు.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై వీహెచ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర ఎన్నికలు కార్పొరేట్ల డబ్బు ప్రవాహంతో నడిచాయని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికలలో తెలంగాణ నుంచి డబ్బులు వచ్చాయని ఆరోపించడం విడ్డూరమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలోని కొన్ని రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉందని చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉండటమే కాక కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ స్థాయిలో ఖర్చు చేసి ఉండొచ్చో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
ఒక్కో స్థానానికి 50 కోట్ల రూపాయలకు మించి ఖర్చు చేయడం వల్లే బీజేపీ గెలవగలిగిందని వీహెచ్ అన్నారు. వయనాడ్‌లో ప్రియాంక గాంధీకి భారీ ఆధిక్యం రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందన్నారు. పార్లమెంట్లో అన్నాచెల్లెళ్లు ప్రజా సమస్యలపై చర్చిస్తారని అన్నారు.