వాహనదారులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్-విజయవాడ హైవేపై రాకపోకలు పునరుద్దరణ..
వాహనదారులు అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. అతివేగంగా వాహనాలు నడపొద్దని పదే పదే చెప్పారు.
Hyderabad Vijayawada NH 65 Highway : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. NH 65 పై ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద మున్నేరు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో హైదరాబాద్ – విజయవాడ మధ్య వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతి ఇచ్చారు. ముందుగా ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. ఆ తర్వాత వాహనాలు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
కాగా.. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులో ఉన్న గరికపాడు వద్ద ఉన్న పాత బ్రిడ్జి ద్వంసమైనందున రెండు వైపుల కొత్త బ్రిడ్జిపై నుండి మాత్రమే వాహనాలను పంపిస్తున్నారు. కొత్త బ్రిడ్జిపై వాహనాల డైవర్షన్ ఏర్పాటు చేశారు. ప్రయాణ సమయంలో వాహనదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వాహనదారులు, ప్రయాణికులు గమనించి బ్రిడ్జిపై నెమ్మదిగా వెళ్లాల్సిందిగా కోరారు. వాహనదారులు అత్యంత అప్రమత్తంగా జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. అతివేగంగా వాహనాలు నడపొద్దని పదే పదే సూచించారు.
Also Read : విజయవాడ ముంపునకు ప్రధాన కారణం ఏంటి? ఈ పాపం ఎవరిది?
కాగా.. జాతీయ రహదారి ఎన్ హెచ్ 65పై వరద పోటెత్తడంతో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ముందు జాగ్రత్తగా వాహనాల రాకపోకలు బంద్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా మళ్లించిన విషయం తెలిసిందే.