బీఆర్ఎస్ పీడ పోయిందన్నారుగా.. మళ్లీ ఎందుకిలా చేస్తున్నారు?: వీహెచ్

బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరుతుంటే కార్యకర్తలు బాధపడుతున్నారని వీహెచ్ అన్నారు.

బీఆర్ఎస్ పీడ పోయిందన్నారుగా.. మళ్లీ ఎందుకిలా చేస్తున్నారు?: వీహెచ్

Vh

Updated On : March 23, 2024 / 5:57 PM IST

V Hanumantha Rao: తెలంగాణ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేయాలనుకున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. అయితే, రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం రావడం లేదని చెప్పారు. ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో వీహెచ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణలో బీఆర్ఎస్ పీడ పోయిందని రేవంత్ రెడ్డి అన్నారని, మరి మళ్లీ ఆ పార్టీ వారిని కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారని వీహెచ్ నిలదీశారు. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడిన వారెవరూ సీఎం కాలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి నాలుగేళ్లు కష్టపడి సీఎం అయ్యారని, పార్టీని బలోపేతం చేశారని అన్నారు.

బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరుతుంటే కార్యకర్తలు బాధపడుతున్నారని వీహెచ్ అన్నారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గమనించాలని చెప్పారు. బీఆర్ఎస్ వద్దని ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని అన్నారు. ఇన్ని ఏళ్ల నుంచి పార్టీలో కష్టపడుతున్న కాంగ్రెస్ నేతలకు న్యాయం చేయకుండా ఇతరులకు టికెట్లు ఇవ్వడం ఏంటని నిలదీశారు.

కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టిన వాళ్లకు టికెట్లు ఇస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. బయట డబ్బులు సంపాదించినవారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటే ఎందుకో అర్థం చేసుకోవాలని అన్నారు.

 Also Read: జైలు నుంచి ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ సందేశం.. చదివి వినిపించిన భార్య