మంత్రివర్గ విస్తరణ.. రాములమ్మకు హోంశాఖ? అమాత్య రేసులో ఉన్న నేతలకు భయం
ఇక ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చినందువల్లే మంత్రి పదవిపై విజయశాంతి ధీమాగా ఉన్నారని, పైగా తనకు హోంశాఖనే దక్కుతుందని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట.

Vijayashanti
కర్తవ్యం సినిమాలో ఆమెది పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్. కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా పోలీసు శాఖకే మంత్రి కాబోతున్నారట. అవును.. హైకమాండ్ కోటాలో ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి మంత్రివర్గంలోనూ చోటు దక్కనుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. క్యాబినెట్‌లో రాములమ్మకు బెర్త్ కన్ఫర్మ్ కావడంతో పాటు ఆమెకు హోంశాఖను ఇస్తారని అంటున్నారు. విజయశాంతికి ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్న వారికి ఇప్పుడు రాములమ్మ భయం పట్టుకుందట.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఎవరికీ అంతు చిక్కదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఒక్కసారిగా విజయశాంతి తెరపైకి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందో తెలియదుకానీ ఇలా ఢిల్లీ వెళ్లి అలా ఎమ్మెల్సీ టిక్కెట్ తెచ్చుకుంది రాములమ్మ. ఇంకేముంది కళ్లు మూసి తెరిచేలోగా ఎమ్మెల్సీ అయిపోయింది విజయశాంతి.
ఇదంతా ఎలా జరిగింది, హఠాత్తుగా విజయశాంతి ఎలా తెరపైకి వచ్చారు, అధిష్టానం ఆలోచన ఎంటీ అన్నది సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో సహా కాంగ్రెస్ నేతలెవ్వరికి అంతుపట్టడం లేదన్న చర్చ జరుగుతోంది. అయితే కథ అంతటితో ఆగిపోలేదన్న టాక్ వినిపిస్తోంది. అసలైన సీన్ ముందుందంటున్నారు.
విజయశాంతి ఆల్ ఆఫ్ సడెన్‌గా ఎమ్మెల్సీ కావడం నుంచి ఇంకా తేరుకోని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు..మరో షాకింగ్ న్యూస్ రాబోతోందని తెలుస్తోంది. రేపోమాపో జరిగే మంత్రివర్గ విస్తరణలో రాములమ్మకు అవకాశం ఇస్తారని అంటున్నారు.
విజయశాంతిని క్యాబినెట్‌లోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే డిసైడ్ అయిందని..ఆమెకు మంత్రివర్గంలో చోటు ఇవ్వడమే కాదు ఏకంగా హోంమంత్రి పదవి కట్టబెట్టాలని హైకమాండ్ నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. ఈ మేరకు వియశాంతికి హామీ ఇచ్చారని చెబుతున్నారు. రాములమ్మను మంత్రివర్గంలోకి తీసుకోవడం కన్ఫర్మ్ అయ్యిందని, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌లో మరింత క్లారిటీ వస్తుందని అంటున్నారు.
విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఆశావాహులు నీరుగారిపోయారు. విజయశాంతి డైరెక్ట్‌గా అధిష్టానం కోటాలో ఎమ్మెల్సీ దక్కించుకోవడం సహజంగానే చాలామందికి మింగుడుపడటం లేదు. ఇక ఇప్పుడు ఆమెకు మంత్రిపదవి కూడా ఇస్తున్నారనగానే అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్నవాళ్లు ఆందోళన చెందుతున్నారట.
ఏడాదిన్నరగా ఎప్పటికప్పుడు వాయిదా
మంత్రి పదవుల ఆశావహులకు ఇప్పుడు రాములమ్మ భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఏడాదిన్నరగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న క్యాబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అయ్యిందన్న సమాచారం సంతోషం కలిగిస్తే..విజయశాంతి సీన్‌లోకి రావడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోందట. విజయశాంతి క్యాబినెట్ రేస్‌లోకి రావడంతో ఎక్కడ తమ అవకాశాన్ని తన్నుకుపోతారోనన్న భయం ఆశావహులను వెంటాడుతోందట.
సామాజిక సమీకరణాల పరంగా చూసుకుంటే తెలంగాణ క్యాబినెట్‌లో బీసీలకు మరో మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విజయశాంతికి బీసీ కోటాలో మంత్రి పదవి కట్టబెట్టేందుకు హైకమాండ్ సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో బీసీ కోటాలో మంత్రి పదవి రేసులో ఉన్న నేతల్లో ఆందోళన నెలకొందట.
ఇక ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చినందువల్లే మంత్రి పదవిపై విజయశాంతి ధీమాగా ఉన్నారని, పైగా తనకు హోంశాఖనే దక్కుతుందని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట. ఏదేమైనా ఇలా వచ్చి అలా ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి క్యాబినెట్‌లో చోటు దక్కుతుందని, అదీ హోంశాఖ అని ప్రచారం జరుగుతుండటం మాత్రం కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అమాత్య ఆశావహుల్లో ఎవరి ఆశలు నెరవేరుతాయో.. ఎవరికి నిరాశ మిగులుతుందో చూడాలి మరి.