VHP : ఊరుకునేది లేదు.. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను వ్యతిరేకిస్తున్న వీహెచ్‌పీ
విద్యార్థులు, యువత చేసిన ఆత్మబలిదానాలను, త్యాగాలను స్మరించాల్సిన రోజు.. అలాంటి రోజున రాజ్ భవన్ లో మిస్ వరల్డ్ గా ఎంపికైన వారిని ప్రశంసిస్తారా?

VHP : తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణను విశ్వహిందూ పరిషత్ వ్యతిరేకిస్తోంది. మిస్ వరల్డ్ పోటీల పేరుతో యాదగిరిగుట్ట, రామప్ప దేవాలయాల పవిత్రత దెబ్బతీయాలని చూస్తే హిందూ సమాజం ఊరుకోదని హెచ్చరించింది. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ రోజు.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో విద్యార్థులు, యువత చేసిన ఆత్మబలిదానాలను, త్యాగాలను స్మరించాల్సిన రోజు.. అలాంటి రోజున రాజ్ భవన్ లో మిస్ వరల్డ్ గా ఎంపికైన వారిని ప్రశంసిస్తారా? ఇది దారుణం అని వీహెచ్ పీ కార్యదర్శి శశిధర్ అన్నారు.
72వ మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్ రెడీ అవుతోంది. మే 7 నుండి 31వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. అంతర్జాతీయ అందాల పోటీల్లో సుమారు 140 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొనబోతున్నారు. పోటీల సందర్భంగా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే నెలలో తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపద, అభివృద్ధిని వీరు ప్రపంచానికి తెలియజేయనున్నారు.
Also Read : చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్.. రూ.61లక్షల వివాదం..? నోటీసులు ఇచ్చేందుకు..
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. మిస్ వరల్డ్ పోటీలు మహిళా సాధికారతకు అద్దం పట్టే సంబరాలుగా ఆయన అభివర్ణించారు. ప్రపంచ దేశాల నుంచి రాబోయే అతిథులకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేందుకు ఇదొక గొప్ప అవకాశం అన్నారు. ఇప్పటికే ధనిక నగరాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్.. ఈ అందాల పోటీలతో వరల్డ్ వైడ్ గా మరింత గుర్తింపు పెరుగుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.
”తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు రాష్ట్రం ఆదాయం పెంచి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే మిస్ వరల్డ్ పోటీల ప్రధాన ఉద్దేశం. అందాల పోటీని మహిళా సాధికారత కోణంలో చూడాలి. మిస్ వరల్డ్ పోటీలపై ప్రతిపక్షాలు చేసే విమర్శలు పట్టించుకోకుండా పాజిటివ్ కోణంలో చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల నుంచి ఈ మిస్ వరర్డ్ పోటీలకు హాజరవుతున్నారు. అంతర్జాతీయ మీడియా ఈ ఈవెంట్ కు వస్తుంది. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ ఈవెంట్ ఉపయోగపడుతుంది. టూరిజాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగానే మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తోంది” అని మంత్రి జూపల్లి తెలిపారు.