Weather Updates: తెలంగాణలోని ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్.. మరో రెండ్రోజులు భారీ వర్ష సూచన.. హైదరాబాద్ నగరంలో..
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. గురువారం మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో ..

Heavy Rain in Hyderabad
Weather Updates: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. గురువారం మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన రైతుల పంట దెబ్బతింది. కల్లాల్లో ఉన్న మిర్చి, ఇతర పంటలు వర్షంపాలు కావడంతో రైతులు కన్నీటి పర్యాంతమవుతున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలోనూ వర్షం దంచికొట్టింది.
భారీ వర్షం కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఖైరతాబాద్, ఆనందనగర్, దిల్ సుఖ్ నగర్, రామ్ నగర్ లలో పలు చోట్ల చెట్లు కూలాయి. కొన్నిచోట్ల వాహనాలపై కూడా చెట్లు కూలి పలువురికి గాయాలయ్యాయి. మలక్ పేట్ ఆర్ యూబీ నడుములోతు నీటిలో నిండింది. దీంతో పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. అయితే, గురువారం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు వర్షం కురియడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. ఇదిలాఉంటే.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న కురిసిన వర్షంకు పిడుగులు పడి, గోడలు కూలి ఐదుగురు చనిపోయారు.
Also Read: Mirchi Farmers: మిర్చి రైతులకు గుడ్ న్యూస్.. ఎర్ర బంగారం ధరలు పెరగబోతున్నాయ్.. ఎలా అంటే..
ఉరితల ఆవర్తనం ప్రభావంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శనివారాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేఫథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో మరో రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు 4డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల , నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్, మహబూబ్ నగర్ జిల్లాలకు శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే వకాశం ఉందని, వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. పిడుగులు పడే సమయంలో కరెంట్ పోల్స్ కి దూరంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.