G Kishan Reddy : అదే మా లక్ష్యం.. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌పై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
Kishan Reddy : ఎవరి విమర్శల కోసమో, పొగడ్తల కోసమో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం లేదు. నేను తెలంగాణ ప్రజల కోసం మాత్రమే రిపోర్ట్ ఇవ్వబోతున్నా

Kishan Reddy
Kishan Reddy – Telangana : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు, పవర్ పాయింట్ ప్రజంటేషన్ అంశాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అనే వార్తలపై స్పందించిన కిషన్ రెడ్డి.. అధ్యక్షుడి మార్పు, ప్రచార కమిటీ చైర్మన్ లాంటి వార్తలకు తొందరలోనే ముగింపు పడుతుందన్నారు. ఇవి చాలా చిన్న చిన్న అంశాలు అని, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక, రాజకీయాలకు అతీతంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వబోతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఎవరినీ లక్ష్యంగా చేసుకోనని, విమర్శించేందుకు ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం లేదని కిషన్ రెడ్డి వివరించారు. తెలంగాణ అభివృద్ధిలో గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటో చెప్పడమే ఈ ప్రజంటేషన్ లక్ష్యం అన్నారాయన.
”రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా, ఏజెన్సీల ద్వారా ఎంత అప్పులు ఇచ్చామో ప్రజల ముందు పెడతాను. నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధి కోసం ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా అంకితభావంతో పనిచేస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఒక అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్రానికి అత్యధికమైన నిధులు ఇచ్చాము. వీటన్నింటిని ప్రజల ముందు పెట్టాలని నిర్ణయించాము. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానో ఈ ప్రజంటేషన్ ఇవ్వడం లేదు.
కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? అనే దానికి మాత్రమే పరిమితం అవుతాం. కేంద్ర ప్రభుత్వం తరపున, నరేంద్ర మోదీ ప్రభుత్వం తరపున సవివరమైన ప్రజంటేషన్ ఇస్తాను. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా వచ్చినటువంటి అప్పులను ప్రస్తావిస్తాను. అప్పులు ఎంత ఇచ్చాం? ఏ సంస్థకు ఎంత ఇచ్చాం? చెబుతాను. రాజకీయపరమైనటువంటి అంశం కాదు ప్రజెంటేషన్. పార్లమెంట్ రిపోర్ట్స్ సహా ప్రజల ముందు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వబోతున్నా. ఎవరి విమర్శల కోసమో, పొగడ్తల కోసమో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం లేదు. నేను తెలంగాణ ప్రజల కోసం మాత్రమే రిపోర్ట్ ఇవ్వబోతున్నా” అని కిషన్ రెడ్డి చెప్పారు.