Telangana Police: ఆ జోన్‌లో పోలీసుల తీరుతో కొత్త చర్చ.. ఎందుకంటే?

ఫిల్మ్‌నగర్‌కు కూతవేటు దూరంలోని పీఎస్‌లోనే ఇలా ఉంటే.. అదే జోన్‌లోని మరో పీఎస్‌లో స్టేషన్ హౌస్‌ ఆఫీసర్‌, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ మధ్య కోల్డ్ వార్ పీక్స్‌కు చేరింది.

Telangana Police: ఆ జోన్‌లో పోలీసుల తీరుతో కొత్త చర్చ.. ఎందుకంటే?

Telangana Police

Updated On : February 28, 2025 / 8:19 PM IST

ఆ జోన్‌లో పోలీసులు తీరు ఎప్పుడూ వివాదాస్పదమే ! పైస్థాయి అధికారి నుంచి.. కింద స్థాయి సిబ్బంది వరకు అదే తీరు. లేటెస్ట్‌గా ఆ ఠాణాల్లో ఖాకీల మధ్య కోల్డ్ వార్ హాట్‌టాపిక్‌గా మారింది. పంచాయితీ పెద్దసార్‌ వరకు వెళ్లింది. చివరికి ఆ ఇద్దరిపై బదిలీ వేటు పడింది.. అసలు ఆ జోన్‌లో ఏం జరిగింది.. ఏం జరుగుతోంది.. ఒకేసారి ఇద్దరి మీద ట్రాన్స్‌ఫర్‌ వేటు పడడం వెనక అసలు కారణాలు ఏంటి?

పీఎస్‌ మెట్లు ఎక్కి సమస్య చెప్పుకుంటే చాలు.. పరిష్కరిస్తారు.. పరిష్కార మార్గం చూపిస్తారనే విశ్వాసం. అందుకే ఖాకీలంటే అంటే ఓ ధైర్యం.. నమ్మకం. అలాంటి పోలీస్ శాఖలో హైదరాబాద్ కమిషరేట్ పరిధిలోని ఓ కీలకమైన జోన్‌లో పోలీసుల తీరు.. కొత్త చర్చకు దారి తీస్తోంది. అక్కడ ఖాకీలు నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటున్నారు.

వరుసగా ఫిర్యాదులు రావడంతో.. ఉన్నతాధికారులు ఆ జోన్‌పై ఫోకస్ పెట్టారు. హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో మొత్తం 7జోన్లు ఉండగా.. వెస్ట్‌ జోన్‌పై మాత్రం ప్రత్యేకమైన నజర్ ఉంటుంది. అక్కడ కనీసం ఏడాదైనా పనిచేయాలని ఖాకీలు ఆరాటపడతారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత.. ఒకటి రెండు జోన్లు మినహా దాదాపు అన్ని జోన్‌లలో స్టేషన్ హౌస్‌ ఆఫీసర్ నుంచి కానిస్టేబుల్స్ వరకు మార్పులు జరిగాయ్‌. వీఐపీ జోన్స్‌లోని పాత పీఎస్‌ల దగ్గరి నుంచి.. ఈ మధ్య కొత్తగా ఏర్పడిన పోలీస్‌ స్టేషన్‌ల వరకు అందరూ కొత్తవారే. ఇక్కడే అసలు సమస్యగా మారింది.

ఈ మధ్యే కొత్తగా ఏర్పడిన పోలీస్‌ స్టేషన్‌లో.. ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. దీని వెనక కారణాలు సంచలనంగా మారాయ్‌. తమ మాట వినడం లేదని.. స్టేషన్ సిబ్బంది కావాలని టార్గెట్‌ చేసి.. వేధింపులకు గురిచేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. తమకు జోన్‌ ఉన్నతాధికారుల సపోర్ట్ ఉందని.. చెప్పినట్లు నడుచుకోకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయంటూ కింది స్థాయి సిబ్బందికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారంటా!

ఎప్పటికప్పుడు నివేదిక
ఫిల్మ్‌నగర్‌కు కూతవేటు దూరంలోని పీఎస్‌లోనే ఇలా ఉంటే.. అదే జోన్‌లోని మరో పీఎస్‌లో స్టేషన్ హౌస్‌ ఆఫీసర్‌, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ మధ్య కోల్డ్ వార్ పీక్స్‌కు చేరింది. రెండు గ్రూపులుగా విడిపోయి ఏకంగా తిట్టుకునే వరకు కూడా వెళ్లిందట. స్టేషన్‌లో పనిచేసే కొందరు మహిళ కానిస్టేబుల్స్‌ను ఇన్వాల్వ్‌ చేస్తూ.. సదరు హౌస్ అఫిసర్ బూతు పురాణం వల్లించాడట. దీనిపై సీపీ దగ్గరే తేల్చుకుంటామని వాళ్లంతా ఎదురుతిరగడంతో…. ఆ జోన్ ఉన్నతాధికారి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారని.. కానీ వర్కౌట్ కావడం లేదని టాక్. ఆ వ్యవహారం నేరుగా సీపీ వరకు చేరడంతో.. ఇద్దరికీ స్థానచలనం కల్పించారు.

బోరబండ పీఎస్‌లో పనిచేసే సీఐ, డీఐపై చర్యలు తీసుకోవడం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది. ఒకే స్టేషన్‌లో పనిచేసే ఇద్దరిపై.. ఒకే సమయంలో బదిలీ వేటు పడడం.. ఈ మధ్య కాలంలో మొదటిసారి జరిగింది. బోరబండ సీఐ వీరశంకర్‌ని చార్మినార్ ట్రాఫిక్ సీఐగా ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇక అదే స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌ భూపాల్ గౌడ్‌ను చాదర్‌ఘాట్‌కు బదిలీ చేశారు.

సిటీలో కొందరు ఖాకీల తీరుపై ఉన్నతాధికారులు ఇంటెలిజెన్స్ వర్గాలు ద్వారా ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటున్నారు. ఒకసారి హెచ్చరిస్తున్నారు.. ఆ తర్వాత కూడా తీరు మారకపోతే.. చర్యలు తీసుకుంటున్నారు. నిజానికి వెస్ట్‌జోన్‌లో పోలీసుల తీరు ప్రతిసారి వివాదాస్పదంగానే ఉంటుంది. వరుస ఘటన తర్వాతల అయినా పోలీసు పెద్దలు నజర్ పెడతారో లేదో చూడాలి మరి.