తెలంగాణలో పాఠశాలలు తెరిచేదెప్పుడో ?

Reopening in telangana state : తెలంగాణలో స్కూళ్లు తెరిచేదెప్పుడో అని చర్చించుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా..విద్యా సంస్థలకు తాళాలు పడ్డాయి. గత మార్చి నుంచి స్కూల్స్ విద్యార్థులు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. విద్యార్థుల చదువు, వారి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని గత నాలుగైదు నెలల నుంచి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. విద్యా సంవత్సరం ముగుస్తున్నా..స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారనే దానిపై క్లారిటీ రావడం లేదు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు ఇంకా తెరుచుకోలేదు. 9వ తరగతి నుంచి ఆపై తరగతుల నిర్వాహణ చేసుకోవచ్చంటూ కొన్ని నిబంధనలు అమలు చేశాయి. కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశాల్లో వెల్లడించాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం స్కూళ్ల ప్రారంభం విషయంలో కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది. విద్యా సంస్థలను 2021, జనవరి 18వ తేదీ నుంచి తెరుస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వం త్వరలోనే ఓ స్పష్టతనిచ్చే అవకాశాలున్నాయి. ఏయే తరగతులకు నేరుగా క్లాసులు నిర్వహిస్తారనేది త్వరలోనే తేలనుంది. విద్యా సంస్థల ఓపెన్ పై పకడ్బంది నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.
ఈ నెల 11వ తేదీన ఉదయం 11.30గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్, వైద్యారోగ్య, విద్యా, అటవీ శాఖ అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో…విద్యా సంస్థల ప్రారంభం విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏ తరగతి నుంచి క్లాసులు నిర్వహించాలి ? ఏ విధంగా నిర్వహించాలి ? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏంటీ ? తదితర అంశాలపై చర్చించనున్నారు. మొత్తానికి ఈనెల 11వ తేదీన స్పష్టత వచ్చే సూచనలున్నాయి.