Bjp: రేపోమాపో తెలంగాణ బీజేపీకి కొత్త రథసారధి!? రేసులో ఉన్న నేతల్లో ఓ వైపు గుబులు..

అంతలోపే తెలంగాణ బీజేపీ అధ్యక్ష సెలక్షన్‌ ఉంటుందన్న చర్చ సాగుతోంది.

Bjp: రేపోమాపో తెలంగాణ బీజేపీకి కొత్త రథసారధి!? రేసులో ఉన్న నేతల్లో ఓ వైపు గుబులు..

Updated On : March 7, 2025 / 7:56 PM IST

తెలంగాణ పాలిటిక్స్‌లో మూడు నెలలుగా ఒకటే చర్చ. అదే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక. ఎందరో ఆశావహులు. ఎన్నో ఈక్వేషన్స్. మరెన్నో క్యాలిక్యులేషన్స్ మధ్య నాలుగైదు నెలలుగా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఎంపిక..డైలీ ఎపిసోడ్‌గా కంటిన్యూ అవుతోంది. అయితే ఇప్పుడు అధ్యక్షుడి ఎంపిక ఆల్మోస్ట్ పూర్తి అయిందని అంటున్నారు కమలనాథులు.

ఏ క్షణంలోనైనా జాతీయ నాయకత్వం నుంచి ప్రకటన రావచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాషాయ రథసారధి రేసులో ఉన్న నేతల్లో ఓ వైపు గుబులు..ఇంకోవైపు ధీమా కనిపిస్తోందట. పైకి మాత్రం తమకే అధ్యక్ష పదవి రాబోతుందని చెబుతున్నప్పటికీ..అధిష్టానం ఏ ఈక్వేషన్స్‌ను లెక్కలోకి తీసుకుంటుందోనన్న టెన్షన్ మాత్రం ఆశావహుల్లో కనిపిస్తోంది.

ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేసిన ఇంచార్జ్‌ శోభా కర్లాందజేను..చాలా మంది నేతలు తనకే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారట. ఏకాభిప్రాయం అటుంచితే ఎవరివారే తనకే పార్టీ పగ్గాలు ఇవ్వాలని కోరడంతో ఓవర్ టు ఢిల్లీ అయిపోయిందట సీన్. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ హైదరాబాద్‌కు రానుండటం ఆసక్తికరంగా మారింది. ఆయన తెలంగాణ పర్యటనలో ఉండగానే బీజేపీ అధిష్టానం అధ్యక్షుడి ఎంపికపై ప్రకటన చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందర్ రావుతో పాటు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, చింతల రాంచంద్రారెడ్డి పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. ఎమ్మెల్యేల నుంచి పాయల్ శంకర్ కూడా తాను రేసులో ఉన్నానని సన్నిహితులతో చెప్పుకుంటున్నారు.

వీరి పేర్లు తెరపైకి
ఇక అనూహ్యంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మరో జాతీయ నేత మురళీధర్ రావు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈటల రాజేందర్ అధ్యక్ష రేసులో ముందున్నారని ఆయన సన్నిహితులు ప్రచారం చేసుకుంటుండటం పార్టీలో అసంతృప్తులకు దారి తీస్తోందట. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జాతీయ స్థాయిలో తనకున్న పరిచయాలతో అధ్యక్ష పదవి కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారట.

మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సైలెంట్‌గా అధ్యక్ష పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నారట. ఇక పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కాకుండా పాతవారికే అధ్యక్ష పదవి ఇవ్వాలన్న డిమాండ్‌తో రాంచందర్ రావు సీనియర్ల మద్దతు కూడగట్టినట్లు టాక్. ఎంపీల్లో ఎవరికి చాన్స్ ఇచ్చిన పార్టీ తమ కంట్రోల్ ఉండదని భావిస్తున్న ఒకరిద్దరు సీనియర్ నేతలు పాయల్ శంకర్ పేరును ప్రతిపాదించినట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక దేశవ్యాప్తంగా మహిళలకు పెద్దపీట వేయాలన్న ఆలోచనలో జాతీయ నాయకత్వం ఉందట. అందులో భాగంగానే డీకే అరుణ పేరు తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక పార్టీ కోసం పనిచేసే వ్యక్తిగా ముద్రపడిన మురళీధర్ రావు కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. బీజేపీ జాతీయ నాయతక్వం కూడా ఓ వైపు రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తూనే మరోవైపు పొలిటికల్ సర్వేలు చేపిస్తోందట.

ఈ నెల 15లోపే జాతీయ అధ్యక్షుడిని ఎన్నిక పూర్తి చేయబోబోతున్నారట. అంతలోపే తెలంగాణ బీజేపీ అధ్యక్ష సెలక్షన్‌ ఉంటుందన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏ క్షణంలోనైనా బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ప్రకటన రావొచ్చన్న టాక్ బలంగా వినిపిస్తోంది. తెలంగాణ కాషాయ రథసారిధిగా ఎవరికి అవకాశం దక్కబోతుందో చూడాలి మరి.