Konda Surekha: కొండా సురేఖను టార్గెట్ చేసింది ఎవరు?

సమంత ఇష్యూతో డిఫెన్స్ లో పడ్డ సురేఖను దెబ్బ కొట్టేందుకు ఇదే సమయం అని భావిస్తున్న సదరు మంత్రి ... ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు పూర్తి అండదండలు అందిస్తున్నారనే టాక్ నడుస్తోంది.

Konda Surekha: కొండా సురేఖను టార్గెట్ చేసింది ఎవరు?

Konda Surekha

Updated On : October 18, 2024 / 8:20 PM IST

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందనే కొత్త ప్రచారం మొదలైంది తెలంగాణ రాజకీయాల్లో! బెర్త్ ఖాళీ అయితే.. ఆ ఛాన్స్ తాము దక్కించుకునేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.

కొండా సురేఖపై పీసీసీకి వరుస పిర్యాదుల వెనక వేరే స్కెచ్ఉందా అంటే.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇంతకీ కొండా సురేఖను టార్గెట్ చేసి.. మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకుంది ఎవరు.. వారికి సహకరిస్తోంది ఎవరు.. ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ మౌనం ఎందుకు.. హ్యావ్ఏ లుక్..

రాజకీయం ఇలా చేయాలని.. ఇలానే చేస్తే రాజకీయం అంటారని లేదు. పాలిటిక్స్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. పాలిటిక్స్ ఎప్పుడూ థ్రిల్లర్మూవీనే! ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు మంత్రి కొండా సురేఖ. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించి.. దానికి దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది.

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్లాన్?
సురేఖ పదవి నుంచి దిగితే.. అవకాశం తమదే అని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్లాన్ వేస్తున్నారట. ఆ ఇద్దరికి ఓ సీనియర్మంత్రి మద్దతుగా నిలిచి సురేఖ మీద పీసీసీకి ఫిర్యాదులు చేయిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. సురేఖ మీద ఫిర్యాదు చేయడానికి వరంగల్ జిల్లా నేతలు.. హైదరాబాద్ కు క్యూ కట్టడం వెనక అదే అసలు రీజన్ అని గాంధీభవన్ గోడల వెనక ముచ్చట్లు వినిపిస్తున్నాయ్.

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ను కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు.. సురేఖతో చాలా ఇబ్బందులు పడుతున్నామని.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కొండా వర్గం జోక్యం చేసుకుంటోందని తమ బాధలు చెప్పుకున్నారట.

తమకెలాంటి సమాచారం ఇవ్వకుండానే తమ నియోజకవర్గాల్లో మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మురళీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. పీసీసీ ముందు ఏకరువు పెట్టుకున్నారట. అంతా విన్న పీసీసీ చీఫ్.. సమస్యను పరిష్కరిస్తానని, పిలిపించి మాట్లాడతానని వారికి హామీనిచ్చారు. ఐతే వాళ్లు మాత్రం తృప్తి చెందలేదని తెలుస్తోంది. ఓ సీనియర్ మంత్రి సలహాతో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఢిల్లీకి వెళ్లి మంత్రి సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

సురేఖను దెబ్బ కొట్టేందుకు ఇదే సమయం అని..

రేవంత్ కేబినెట్లో ఓ సీనియర్ మంత్రికి.. కొండా సురేఖకు మధ్య చాలారోజులుగా విభేదాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని పట్టుదలతో ఉన్న ఆ సీనియర్ మినిస్టర్.. మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరికి అండగా ఉంటున్నారనే టాక్ నడుస్తోంది.

సమంత ఇష్యూతో డిఫెన్స్ లో పడ్డ సురేఖను దెబ్బ కొట్టేందుకు ఇదే సమయం అని భావిస్తున్న సదరు మంత్రి … ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు పూర్తి అండదండలు అందిస్తున్నారనే టాక్ నడుస్తోంది.అయితే డిల్లీకి వెళ్లాలనుకున్న ఆ ఎమ్మెల్యేలకు అధిష్టానం సమయం ఇవ్వకపోవడంతో హస్తిన టూర్ కు బ్రేకులు పడ్డట్లు తెలుస్తోంది.

మంత్రి పదవి చుట్టూ ఇంత తతంగం జరుగుతున్నా.. తన మంత్రివర్గ సహచరురాలు కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి సీఎం రేవంత్.. మౌనంగా ఉండటం ఇప్పుడు ఆసక్తిరేపుతోంది. సురేఖను కేబినెట్నుంచి తప్పించడానికి జరుగుతున్న కుట్ర వెనక ఉన్న మరో మంత్రి… ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితులు కావడం ఇప్పుడు ఆసక్తిరేపుతోంది. మరి ఈ అంతర్గత విభేదాలతో.. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందా… లేదంటే అధిష్టానం ఈ అంశాన్ని లైట్ తీసుకుంటుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వీట్‌ వార్నింగ్‌.. ఏం జరిగింది?