బీసీ కులాలను ఆకట్టుకునే పనిలో కాంగ్రెస్

బీసీల్లో యాదవులు, కురుమలు పెద్ద సంఖ్యలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కురుమలు ఓట్లు ఎక్కువగా ఉంటాయి.

బీసీ కులాలను ఆకట్టుకునే పనిలో కాంగ్రెస్

CM Revanth Reddy

Updated On : November 4, 2024 / 9:18 PM IST

అధికార పార్టీ రూట్‌ మార్చింది. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే..ప్రజల్లో అసంతృప్తి ఉందని భావిస్తున్న కాంగ్రెస్..రాబోయే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. రాబోయే నాలుగేళ్లలో ఒక్కో వర్గానికి దగ్గరవుతూ..వారిని కాంగ్రెస్‌ కట్టర్‌ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే ప్లాన్ చేస్తోంది. అందుకే అలా ఎన్నిక‌లు ముగిశాయో లేదో.. అప్పుడే మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ప్లాన్లు ర‌చిస్తోంది. యాద‌వ‌, కురుమ సామాజిక‌వ‌ర్గాల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తుంది.

తెలంగాణ‌లో యాద‌వ‌, కురుమ సామాజిక‌వ‌ర్గాల ఓట్లు పెద్దసంఖ్యలో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో కురుమ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు చాలా ఎక్కువగా ఉంటారు. అందుకే గ‌త ప్రభుత్వంలో ఈ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకోవ‌డం కోసం స‌బ్సిడీ కింద గొర్రెలు ఇచ్చారు. ఈ స్కీమ్‌తో మెజారిటీ కురుమ‌, యాద‌వ ప్రజ‌లు బీఆర్‌ఎస్ వైపు మ‌ళ్లారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వ‌చ్చాక నిధుల కొరత కార‌ణంగా గొర్రెల స్కీమ్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టారు. దీంతో కాంగ్రెస్ స‌ర్కార్ ప‌ట్ల యాద‌వ‌, కురుమ‌లు కాస్త గుర్రుగా ఉన్నారు. దీంతో వారిని కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ప‌ట్టణాల‌లో యాద‌వ‌, కురుమ‌లు స‌ద‌ర్ పండుగ‌ను ఘనంగా జరుపుకుంటారు. ఈ స‌ద‌ర్‌ను ఎక్కువ‌గా హైద‌రాబాద్ సిటీలో నిర్వహిస్తుంటారు. ఈ సారి స‌ద‌ర్‌ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. కొన్ని నిధులు కూడా కేటాయించింది.

ఇదే ఫ‌స్ట్ టైం
రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌పున స‌ద‌ర్‌ను అధికారికంగా నిర్వహించ‌డంతో పాటు.. స‌ద‌ర్ వేడుక‌ల‌కు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఇప్పటి వ‌ర‌కు చ‌రిత్రలో ఏ సీఎం కూడా స‌ద‌ర్ వేడుక‌కు ముఖ్యమంత్రి హోదాలో హాజ‌రు కాలేద‌ట‌. ఫ‌స్ట్ టైం ఒక సీఎంగా రేవంత్ రెడ్డి స‌ద‌ర్ వేడుక‌కు హాజ‌రయ్యారు. దీంతో ఆయా వ‌ర్గాల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డంతో పాటు వారిలో పాజిటివ్ అభిప్రాయం వచ్చేలే ప్రయత్నం చేశారు. యాద‌వ‌, కురుమ వ‌ర్గాలు కూడా సీఎం హాజ‌రు కావ‌డం.. స‌ద‌ర్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించి నిధులు విడుద‌ల చేయ‌డంపై హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కులగణనకు శ్రీకారం చుడుతోంది సర్కార్. బీసీల కోసమే ఈ కులగణన చేపడుతున్నట్లు కూడా చెప్పకనే చెప్తోంది. బీసీల్లో కూడా యాదవులు, కురుమలు పెద్ద సంఖ్యలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కురుమలు ఓట్లు ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్‌లో యాదవులు ఎక్కువగా ఉంటారు. ఈ రెండు వర్గాలకు దగ్గరైతే అటు గ్రామీణ ప్రాంతంలో..ఇటు పట్టణాల్లో బలంగా ఉంటామని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అంతేకాదు సదర్‌ను అధికారికంగా నిర్వహించడం వెనక మరో కారణం ఉందట. త్వరలో GHMC ఎన్నికలు రాబోతున్నాయి. గ్రేటర్‌లో జరగనున్న ఎన్నికల్లో యాదవ ఓటర్లను ఆకట్టుకునేందుకే సీఎం సదర్‌ను అధికారికంగా నిర్వహించారన్న టాక్ కూడా ఉంది. ఇలా ఏ చిన్న అంశాన్ని వదులుకోవడం లేదు సీఎం రేవంత్.

ఓరుగల్లు కాంగ్రెస్‌లో లుకలుకలు.. సీఎం పర్యటనలో కనిపించని ఇద్దరు ఎమ్మెల్యేలు