స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై పంచాయితీ తేలేనా? ఆర్డినెన్స్‌ తెస్తే గవర్నర్ సంతకం చేస్తారా?

ఒకవేళ అప్పుడు కూడా కోర్టులు అభ్యంతరం చెప్తే కులగణన సర్వే డేటా, డెడికేటెడ్‌ కమిషన్‌ రిపోర్ట్‌ను చూపించడానికి ప్రిపేర్ అవుతోందట కాంగ్రెస్ ప్రభుత్వం

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై పంచాయితీ తేలేనా? ఆర్డినెన్స్‌ తెస్తే గవర్నర్ సంతకం చేస్తారా?

CM Revanth Reddy

Updated On : July 12, 2025 / 9:57 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో..42శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకునేందుకు..సీరియస్‌గానే ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఆర్డినెన్స్‌ తెచ్చి..రిజర్వేషన్లు అమలు చేస్తామంటోంది. దీంతో బీసీ సంఘాలు..తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామనే ధీమాతోనే ఉన్నారు. అయితే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ సంతకం చేస్తారో లేదోనన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి డౌట్స్‌ వస్తున్నాయట.

అందుకే జీవో ఇచ్చి రిజర్వేషన్లు అమలు చేయాలనే ప్లాన్‌లో ఉందట రేవంత్ సర్కార్. రిజర్వేషన్లు 50 శాతం మించొద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాలుండటం, ఇప్పటికే రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉండటంతో ఏం చేస్తే బాగుంటుందనే దానిపై తీవ్ర కసరత్తే చేస్తోందట కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్డినెన్స్ తెచ్చినా గవర్నర్ సంతకం చేయకపోతే ఫెయిల్ పోతామని..జీవో ద్వారా 42శాతం బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయడమే కరెక్ట్ అనుకుంటున్నారట సర్కార్ పెద్దలు.

Also Read: జూనియర్లపై సీఎం గరం.. సీనియర్లలో ఆశలు.. క్యాబినెట్‌లో మార్పులు, చేర్పులు?

తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపి మూడు నెలలు కావొస్తోంది. మూడు నెలల క్రితం అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లు ఆధారంగానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ప్రకారం ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో ఇవ్వనున్నట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై జీవో ఇచ్చి..ఎవరైనా కోర్టులకెళ్లి అడ్డుకోకుండా హైకోర్టులో కేవియట్ పిటిషన్ వేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోందట.

రిపోర్ట్‌ను చూపించడానికి ప్రిపేర్
ఒకవేళ అప్పుడు కూడా కోర్టులు అభ్యంతరం చెప్తే కులగణన సర్వే డేటా, డెడికేటెడ్‌ కమిషన్‌ రిపోర్ట్‌ను చూపించడానికి ప్రిపేర్ అవుతోందట కాంగ్రెస్ ప్రభుత్వం. రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన మినహాయింపులో ఈ డేటా కీలకం కానుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 10 శాతం EWS రిజర్వేషన్ల కోసం చేసిన 103వ రాజ్యాంగ సవరణతో విద్య, ఉద్యోగాల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటినా..సుప్రీంకోర్టు వాటిని సమర్థించిన సందర్భాలున్నాయి. ఈ అంశం న్యాయపరంగా తమకు కలిసివస్తుందని రేవంత్ సర్కార్ భావిస్తుందట.

క్యాబినెట్ నిర్ణయం ప్రకారం మండలం, జిల్లా, రాష్ట్రం యూనిట్‌‌గా బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి ఖరారు చేస్తూ వారం, పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్‌‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై జారీ చేయబోయే జీవోకు అనుగుణంగా పంచాయతీ రాజ్ చట్టం-2018లోని సెక్షన్ 285(A)ను సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలని కూడా నిర్ణయించిందట.

ఈ ఆర్డినెన్స్‌తో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని పూర్తిగా తొలగించి..బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటోందట ప్రభుత్వం. అయితే జీవో ద్వారా రిజర్వేషన్ల అమలుకు అడ్డంకులు ఏమైనా ఉంటాయా.? ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అయ్యేనా అనేది సస్పెన్స్‌గా మారింది. తెలంగాణలో రాజకీయంగా హీట్ పుట్టిస్తున్న బీసీ రిజర్వేషన్ల అంశంలో..రేవంత్ సర్కార్ ఎలా గట్టెక్కుతుందో చూడాలి మరి.