Yellandu Constituency: ఆసక్తికర రాజకీయానికి కేరాఫ్‌ ఇల్లందు.. బీఆర్‌ఎస్ టికెట్ కొత్తవాళ్లకేనా.. కాంగ్రెస్ తరపున ఆయనేనా?

ఇల్లుందు రాజకీయం వాడివేడిగా ఉండగా, ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కొత్తవారే బీఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తారనే టాక్ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తుండగా..

Yellandu Constituency: ఆసక్తికర రాజకీయానికి కేరాఫ్‌ ఇల్లందు.. బీఆర్‌ఎస్ టికెట్ కొత్తవాళ్లకేనా.. కాంగ్రెస్ తరపున ఆయనేనా?

Yellandu Assembly Constituency Ground Report

Updated On : August 2, 2023 / 4:28 PM IST

Yellandu Assembly Constituency: రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ప్రతిపక్షాన్ని గెలిపించడం అక్కడి ఓటర్లకు అలవాటు.. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు పెద్దపీట వేసిన ఓటర్లు.. గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కి జైకొట్టారు.. అలా గెలిచిన ఎమ్మెల్యేలు.. ఏవేవో సాకులు చెప్పి సొంత పార్టీకి హ్యాండిచ్చి కారు పార్టీలో చేరిపోయారు.. ఇలా ఆసక్తికర రాజకీయానికి కేరాఫ్‌గా నిలిచిన ఆ నియోజకవర్గమే ఇల్లందు.. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట అయిన ఇల్లందులో గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి కారణమేంటి? అలా గెలిచిన వారు పార్టీలు మారారు సరే.. ఈ సారి ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండనుంది..?

ఇల్లందు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. తొలి శాసనసభ్యునిగా కెఎల్ నర్సింహారావు విజయం సాధించారు. 1967లో నేత జి.సత్యనారాయణ గెలిచారు. ఆ తర్వాత ఎందరో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినా.. సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ నేత గుమ్మడి నరసయ్య సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా పనిచేశారు. నిజాయితీకి నిరాడంబరతకు మారుపేరేన నరసయ్య సుమారు ఐదుసార్లు ఏకధాటిగా ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. రాష్ట్ర విభజన వరకు నరసయ్యే ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. నరసయ్య హయాంలో కమ్యూనిస్టుల ఖిల్లాగా ఉన్న ఇల్లందు.. 2014లో కాంగ్రెస్ ఖాతాలో పడింది. సుమారు 42 ఏళ్ల తరువాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా కోరం కనకయ్య పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత అభివృద్ధి పేరుతో కారెక్కేశారు. 2018లో కోరం కనకయ్య (Koram Kanakaiah) బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా బానోత్ హరిప్రియ నాయక్ (Haripriya Naik) పోటీ చేసి విజయం సాధించారు. కొంతకాలానికి హరిప్రియ నాయక్ కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా కాంగ్రెస్ నుంచి ఇద్దరు నేతలు పార్టీ మారిపోవడంతో హస్తం పార్టీ క్యాడర్ ఖంగుతిన్నారు.

Koram Kanakaiah

Koram Kanakaiah

ఇలా కాంగ్రెస్ నుంచి ఇద్దరు ముఖ్యనేతలు తీసుకోవడంతో బీఆర్‌ఎస్‌లో వర్గ పోరు మొదలైంది. మాజీ ఎమ్మెల్యే కనకయ్యను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ చేయగా, ఆయన ఈ మధ్యనే మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. మాజీ ఎంపీ పొంగులేటి అనుచరుడైన కనకయ్య బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయడంతో ప్రస్తుత ఎమ్మెల్యేకు వర్గ పోరు తప్పినట్లైంది. కానీ, ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ భర్త హరిసింగ్ జోక్యం ఎక్కువగా ఉండటంతో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

Haripriya Naik

Haripriya Naik

కాంగ్రెస్ను వీడి కారెక్కిన తరువాత కాంగ్రెస్ వాళ్లను టార్గెట్ చేయటం, పోడు భూముల ఆక్రమణ, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు, భూ కబ్జాలు, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడంతో షాడో ఎమ్మెల్యేగా హరి సింగ్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే తండ్రి, ఇతర బంధువుల వ్యవహారశైలి కూడా ఎమ్మెల్యేకు మైనస్‌గా మారుతోంది. అయితే బలమైన లంబాడి సామాజిక వర్గ నేతగా హరిప్రియాకు ఆ వర్గం మద్దతు కలిసివచ్చే అవకాశం ఉంది. ఇల్లందు బస్సు డిపో, నియోజకవర్గానికి 16 వందల కోట్లు నిధులు తీసుకురావడం ఎమ్మెల్యేకు సానుకూల అంశాలుగా చెబుతున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రతి గ్రామంతో సంబంధాలు ఉండటం హరిప్రియానాయక్‌కు బలమని అంటున్నారు.

Kavitha Maloth

Kavitha Maloth

ఐతే నియోజకవర్గ అభివృద్ధికి ఆమె ఎంతలా పనిచేసినా.. ఆరోపణలు, క్యాడర్ వ్యతిరేకత వల్ల ఈ సారి ఎమ్మెల్యేకు బీఆర్‌ఎస్ టిక్కెట్ దక్కడం కష్టమనే ప్రచారం జరుగుతోంది. ప్రధాన పోటీదారు కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీలో చేరినా… ఆశావహుల సంఖ్య మాత్రం చాలానే ఉంది. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత (Kavitha Maloth), మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఆంగోత్ బిందు, మాజీ ఎమ్మెల్యే నరసయ్య కుమార్తె, ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ (Gummadi Anuradha), సంజీవ్ నాయక్ బీఆర్‌ఎస్ టిక్కెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు.

Gummadi Anuradha

Gummadi Anuradha

ఇక కాంగ్రెస్ తరఫున ఎక్కువ మంది నేతలు టిక్కెట్ కోసం పోటీపడుతున్నా.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులు, అండదండలు ఉన్నవారికే అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. పొంగులేటి అనుచరుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ మధ్యే మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఐతే ఆయన గతంలో పార్టీ తరపున గెలిచి.. బీఆర్‌ఎస్‌లో చేరడాన్ని స్థానిక క్యాడర్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా గతంలో ఎమ్మెల్యేగా ఆయన పనితీరుపై ఎక్కువగా విమర్శలే ఉన్నాయి. జిల్లాల విభజన సమయంలో ఇల్లందును పట్టించుకోలేదని, సీతారామ ప్రాజెక్టు నీరు ఇతర జిల్లాలకు తరలిస్తున్నా అడ్డుకోలేకపోయారనే అపవాదు ఎదుర్కొంటున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు చాలా అంశాలు సానుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్ క్యాడర్‌లో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులను తన వెంట కాంగ్రెస్‌లోకి తీసుకురావడం కనకయ్యకు అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉందంటున్నారు.

Also Read: మునుగోడు ఉప ఎన్నికలకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారు..?

ఇక గత రెండుసార్లు ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులే గెలవడంతో టిక్కెట్ ఎవరికి ఇచ్చినా.. గెలుస్తామంటూ చాలా మంది నేతలు టిక్కెట్లను ఆశిస్తున్నారు. చీమల వెంకటేశ్వర్లు (chimala venkateshwarlu), డాక్టర్ రవి, లక్ష్మణ్ నాయక్, గుండెబోయిన నాగమణి (gundeboina nagamani), దళ్ సింగ్ నాయక్, పోరిక సాయిరాం నాయక్, విజయలక్ష్మి.. ఇలా ఏడుగురు నేతలు కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ కాంగ్రెస్‌లో మూడు వర్గాలు ఉండగా, తాజాగా పొంగులేటి వర్గం ఒకటి తయారుకావడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. టిక్కెట్ ఆశిస్తున్న నేతలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ రేణుకా చౌదరి వర్గాలుగా విడిపోవడం హాట్‌టాపిక్ అవుతోంది.

Also Read: 3 ఎన్నికలు.. 3 విలక్షణమైన తీర్పులు.. ఈసారి వైరాలో గెలిచేది ఏ పార్టీ అభ్యర్థి?

ఇలా ప్రధాన పార్టీల రాజకీయం పోటాపోటీగా ఉండగా, మాజీ ఎమ్మెల్యే నరసయ్య వైఖరి కూడా చర్చనీయాంశంగా మారింది. వరుసగా ఐదుసార్లు గెలిచిన నరసయ్య గత రెండు సార్లు ఓటమి చవిచూశారు. ఆయనకు పట్టున్న మండలాలు నియోజకవర్గ విభజనలో మరో నియోజకవర్గంలో కలిసిపోవడంతో రెండుసార్లు ఆయనకు ఓటమే ఎదురైంది. ఇక ఈ సారి ఆమె కుమార్తె గుమ్మడి అనురాధ బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్న అనురాధ చదువుకుంటున్నపుడే విద్యార్థి నాయకురాలిగా పనిచేశారు. తండ్రి రాజకీయ నేపథ్యం, ఆయన నిజాయితీ, అధికార పార్టీ బలంతో గెలుస్తానని ఆమె ధీమాగా ఉన్నారు.

Also Read: కొత్తగూడెంలో హీటు రేపుతోన్న పొలిటికల్ టెంపరేచర్.. మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్ అదే!

ఇలా ఇల్లుందు రాజకీయం వాడివేడిగా ఉండగా, ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఏదైనా సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకతతో కొత్తవారే బీఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తారనే టాక్ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తుండగా, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కనకయ్యకే మరోసారి చాన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఆగస్టులో అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారనే అంచనాలు ఉన్నందున త్వరలో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తోంది.