Yoga Vignana Kendra : కరోనా బాధితుల ఆకలి తీరుస్తున్న యోగ విజ్ఞాన కేంద్ర, బాధితుల ఇళ్లకే ఉచితంగా పౌష్టికాహారం

పక్కింట్లో ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిస్తే మన ఇంటి తలుపులు, కిటికీలు మూసేసుకుని బతుకుతున్న రోజుల్లో ఉన్నాం మనం. ఇక మన ఇంట్లోనే ఎవరికైనా పాజిటివ్ అని తేలితే భయం భయంగా బతికే మనస్తత్వాలు మనవి. సొంత వాళ్లే అయినా దగ్గరికి వెళ్లేందుకు కూడా సాహసించం. వాళ్ల ఆకలి తీర్చేందుకు, భోజనం ప్లేట్ ఇచ్చేందుకు కూడా ఆలోచిస్తాం. అలాంటిది.. ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా సేవే పరమావధిగా కోవిడ్ పెషేంట్ల పాలిట అన్నపూర్ణగా మారింది కూకట్ పల్లిలోని యోగ విజ్ఞాన కేంద్ర.

Yoga Vignana Kendra : కరోనా బాధితుల ఆకలి తీరుస్తున్న యోగ విజ్ఞాన కేంద్ర, బాధితుల ఇళ్లకే ఉచితంగా పౌష్టికాహారం

Yoga Vignana Kendra

Updated On : April 30, 2021 / 12:53 PM IST

Yoga Vignana Kendra : పక్కింట్లో ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిస్తే మన ఇంటి తలుపులు, కిటికీలు మూసేసుకుని బతుకుతున్న రోజుల్లో ఉన్నాం మనం. ఇక మన ఇంట్లోనే ఎవరికైనా పాజిటివ్ అని తేలితే భయం భయంగా బతికే మనస్తత్వాలు మనవి. సొంత వాళ్లే అయినా దగ్గరికి వెళ్లేందుకు కూడా సాహసించం. వాళ్ల ఆకలి తీర్చేందుకు, భోజనం ప్లేట్ ఇచ్చేందుకు కూడా ఆలోచిస్తాం. అలాంటిది.. ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా సేవే పరమావధిగా కోవిడ్ పెషేంట్ల పాలిట అన్నపూర్ణగా మారింది హైదరాబాద్ కూకట్ పల్లిలోని యోగ విజ్ఞాన కేంద్ర. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వేలాది మంది కోవిడ్ బాధితుల ఆకలి తీరుస్తూ అందరి చేత అన్నదాత సుఖీభవ అని దీవించబడుతోంది.

26ఏళ్ల క్రితం రిషి ప్రభాకర్ గురూజీ మాతా అన్నపూర్ణేశ్వరి యోగ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పుడు దీన్ని ఆయన శిష్యుడు జగద్ గురూజీ నడుపుతున్నారు. ఆయన నేతృత్వంలో రోజూ వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు.

దశాబ్దాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న యోగ కేంద్ర.. ప్రస్తుతం కరోనా బాధితుల పాలిట అన్నపూర్ణగా మారింది. హోం ఐసోలేషన్ లో ఉంటూ వంట చేసుకునే పరిస్థితి లేక పౌష్టికాహారం తినలేక ఇబ్బంది పడుతున్న వాళ్లకు మేమున్నాం అనే భరోసా ఇస్తోంది. కోవిడ్ తో పోరాడుతున్న వారందరికి ఉచితంగా అన్నదానం చేస్తోంది.

కరోనా బాధితులకు అందిస్తున్న ఆహారం కూడా ఏదో మామూలు ఆహారం కాదు. ఏడు రకాల రుచులతో మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. వంటల తయారీలోనూ పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తున్నారు. కేవలం ఒక్క ఫోన్ చేస్తే చాలు వందలాది కోవిడ్ బాధితులకు ఉచితంగానే పౌష్టికాహారం అందిస్తున్నారు.

భోజనం కావాల్సిన కోవిడ్ బాధితులు యోగ కేంద్రకి ఫోన్ చేసి తమ పేరు నమోదు చేసుకోవాలి. కుటుంబసభ్యులందరికి పాజిటివ్ వచ్చినా సరే, వాళ్లందరికి ఫుడ్ అందిస్తారు. యోగ కేంద్రకి సమీపంలో ఉన్న వారికి తమ వాలంటీర్లే ఫుడ్ డెలివరీ చేస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కోవిడ్ బాధితుల సన్నిహితులు, బంధువులు వచ్చి తీసుకెళ్తున్నారు. కష్టకాలంలో కోవిడ్ బాధితులకు పౌష్టికాహారం అందిస్తున్న యోగ కేంద్రకి అంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చల్లగా ఉండాలని దీవిస్తున్నారు.

కరోనా బాధితులే కాదు ప్రతి రోజూ యోగ కేంద్ర దగ్గరికి వచ్చే వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు. రోజూ మధ్యాహ్నం 12 అయిందంటే చాలు వందలాది మంది ఇక్కడ భోజనం చేసేందుకు బారులు తీరతారు. 26ఏళ్లుగా ఈ అన్నదాన కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతోంది. ఇక్కడ మాత్రమే కాదు యోగ కేంద్రానికి చెందిన సంచార అన్నదాన ప్రసాద రథం నగరంలోని రైతు బజార్లు, ఆసుపత్రులు దగ్గరికి వెళ్లి ఆకలి తీరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విపత్తులు సంభవించినా, అక్కడికి తమ మొబైల్ అన్న ప్రసాద రథం వెళ్లి ఉచితంగా అన్నదానం చేస్తోంది. కోవిడ్ బాధితులు, అన్నార్తుల కోసం యోగ కేంద్ర చేస్తున్న ఈ మంచి పనిని నగర ప్రజలు అభినందిస్తున్నారు.

పౌష్టికాహారం…
రైస్, వెజిటబుల్ కర్రీ, పాల కూర పప్పు, హెర్బల్ బేస్ పచ్చడి, లెమన్ బటర్ మిల్క్, రాగి హల్వా

”కరోనా ఫస్ట్ వేవ్ లో కూడా రోజూ తిరిగి తిరిగి 2వేల మందికి అన్నదానం చేశాము. అప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు మాత్రమే కరోనా బారిన పడేవారు. ఇప్పుడు ఇంటిల్లి పాదికి కరోనా అని చెబుతున్నారు. వంట చేసుకునే పరిస్థితి లేని వారికి ఆహారం ఉచితంగా ఇస్తున్నాం. సేవే పరమావధిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 26ఏళ్లుగా నిర్విరామంగా ఉచిత అన్నదాన కార్యక్రమం నడుస్తోంది. మేము అన్నం దానం చెయ్యడం లేదు. ఇది అన్న ప్రసాదం. దీన్ని అన్నపూర్ణ ప్రసాద కిట్ అంటారు. మేము అన్నదానం అనము. దానం అంటే ఉన్నవాడు లేని వాడికి ఇచ్చేది. ఇలా అలా కాదు. ఆకలి ఉన్న ప్రతి వ్యక్తీ పేదోడే. వాడు అన్నం తింటున్నాడు అంటే పేదోడే. అందుకే, నాకు అన్న సేవ అంటే దైవ కార్యం అంటే ఎక్కువ” అని జగద్ గురూజీ చెప్పారు.