Today Headlines : పోలింగ్ శాతాన్ని వెల్లడించాలని రేవంత్ రెడ్డి డిమాండ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ డబ్బులు పంచాయన్న కిషన్ రెడ్డి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలవడనున్నాయి.

కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..
పోలింగ్ ముగిసి, ఈవీఎంలు సీల్ చేసి, స్ట్రాంగ్ రూంలకు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎంత రాత్రైనా పోలింగ్ ఎంత శాతం నమోదైందన్న వివరాలను ఎన్నికల సంఘం ఈ రోజే వెల్లడించాలన్నారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈసీ ని డిమాండ్ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
సీఎం జగన్ కడప పర్యటన ..
సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో జగన్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున మజార్లకు చాదర్ సమర్పించారు. అనంతరం పెద్ద దర్గాలో జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మళ్లీ వాయిదా..
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ మళ్లీ వాయిదా పడింది. డిసెంబర్ 12కు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ప్రాణం తీసిన సిరప్..
గుజరాత్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆయుర్వేదిక్ సిరప్ తాగి ముగ్గురు మృతి చెందారు.
తిరుమలకు చంద్రబాబు ..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమలకు పయనమయ్యారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని చంద్రబాబు నాయుడు దర్శించుకోనున్నారు. బెయిల్ పై విడుదలయ్యాక తొలిసారి సతీసమేతంగా తిరుమలకు చంద్రబాబు వెళ్లనున్నారు.
ఓటు వేసిన జూపల్లి రామేశ్వర్ రావు
మైహోం ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో గురువారం ఆయన ఓటు వేశారు.
ఓటు వేసిన జూపల్లి రామేశ్వర్ రావు
మేం ఓటేశాం.. మరి మీరు?
‘ఒక ఓటు ఒక విలువ’ అని రాజ్యాంగాన్ని ప్రవేశ పెట్టే సమయంలో బాబాసాహేబ్ అంబేద్కర్ అన్నారు. ఆ ఓటు హక్కును నేడు తెలంగాణలోని ట్రాన్స్జెండర్లు వినియోగించుకున్నారు. అనంతరం వారు పోలింగ్ కేంద్రం వద్ద తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాము ఓటేశామని, మీరు కూడా ఓటేయమంటూ మిగిలిన ఓటర్లను చైతన్యం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఓటర్లు అంతా తమ హక్కుని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
విషాదం..
ఆదిలాబాద్ జిల్లా మావల పోలింగ్ కేంద్రం వద్ద విషాదం చోటు చేసుకుంది. 140 పోలింగ్ కేంద్రలో ఓటు వేసేందుకు వచ్చిన తోకల గంగమ్మ (80) అనే ఓటరు పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలింది. గంగమ్మను వెంటనే పోలింగ్ కేంద్రం నుంచి రిమ్స్ కు తరలించారు. ఆమె వెంట ఒక పోలింగ్ ఏజెంట్ కూడా వెళ్లారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.
సీఎం కేసీఆర్ ఓటు..
ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన స్వగ్రామమైన చింతమడకలో బూత్ నెంబర్ 13లో ఆయన తన ఓటు వేశారు. చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్
సెలబ్రిటీస్ ..
తెలంగాణలో ఓట్ల పండుగ కొనసాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు.
ఓటుహక్కు వినియోగించుకున్న రాజకీయ నేతలు
తెలంగాణలో ఓట్ల పండుగ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అయినా సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. దీంట్లో భాగంగా..ఖమ్మం జిల్లా నారాయణపురంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓటు వేశారు. పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్ధి చల్లా ధర్మారెడ్డి,నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో ఇంద్రకరణ్ రెడ్డి,ఖమ్మం గొల్లగూడెంలో తుమ్మల నాగేశ్వరరావు వంటి పలువురు రాజకీయ నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.