నెల్లూరు జిల్లాలో బంగారం, వెండి కలకలం

నెల్లూరు జిల్లాలో బంగారం, వెండి కలకలం

Updated On : April 2, 2019 / 5:48 AM IST

నెల్లూరు జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం, వెండి వస్తువులు దొరకటం కలకలం రేపింది. కోవూరు సమీపంలోని ఇనమడుగు సెంటర్ లో వాహనాలు చెక్ చేస్తున్న ఖాకీలకు అత్యంత భద్రత మధ్య తరలిస్తున్న బంగారం, వెండి వస్తువులు కంటపడ్డాయి. బంగారం 19 కిలోలు ఉండగా.. వెండి 108 కిలోలు ఉంది. ఇదంతా ఆభరణాల రూపంలో ఉంది. వెండి అయితే చిన్నచిన్న వస్తువులుగా ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరలిస్తున్న వ్యక్తులు పత్రాలు చూపించటం, లలితా జ్యువెలరీకి చెందిన వస్తువులుగా చెప్పటంతో మరింత అనుమానం వచ్చింది. 

ఆభరణాలను తరలిస్తున్న వ్యక్తికి ఫోన్ చేసి రప్పించారు పోలీసులు. అదే సమయంలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇదంతా అర్థరాత్రి వరకు కొనసాగింది. ట్యాక్స్ అధికారులు బిల్లులను తనిఖీ చేయటం, యజమాని సైతం అగ్రిమెంట్ పేపర్లు చూపించారు. ఇవన్నీ సరిపోయాయి అని లెక్కసరిపోయినట్లు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నిర్ధారించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

చెన్నైలోని లలితా జ్యువెలరీ, ఇతర బంగారం షాపులకు సరఫరా చేస్తున్నట్లు తేలటంతో వదిలేశారు. అయితే ఈలోపే ఈ విషయంలో నెల్లూరు జిల్లాలో గుప్పమంది. ఎన్నికల్లో పంచిపెట్టటానికి వెండి ఆభరణాలను తీసుకొస్తున్నారని.. పోలీసులకు పట్టుబడ్డాయనే ప్రచారం జరిగింది. ఇదంతా తూచ్ అని.. అలాంటి ఏమీ లేదని పోలీసులు వెల్లడించారు.