విషాదం..పాము కాటుకు మహిళ మృతి

విజయవాడ : కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాము కాటుకు నాగేశ్వరమ్మ అనే 40 ఏళ్ళ మహిళ కన్ను మూసింది. పాము కాట్లు దివిసీమ వాసులను బెంబేతెత్తిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతంలో పాము కాట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రైతులు, రైతు కూలీలు పాము కాట్లకు బలై మరణిస్తున్నారు. నాగాయలంక మండలం పెదపాలెం గ్రామానికి చెందిన బొడ్డు నాగేశ్వరమ్మ (40) అనే మహిళను మంగళవారం సెప్టెంబరు3వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇంటివద్ద పాము కరిచింది. ఆరు బయట నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది.
కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే నాగాయలంకలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేకపోవటంతో అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విష ప్రభావం ఎక్కువ అవటంతో అవనిగడ్డ ఏరియా ఆస్పత్రి నుంచి మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే నాగేశ్వరమ్మ మరణించింది. నాగేశ్వరమ్మ మృతితో అవనిగడ్డ నియోజకవర్గంలో పాముకాటు మృతుల సంఖ్య 10 కి చేరింది. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు, 2 సంవత్సరాల బాబు ఉన్నారు.
2019 సంవత్సరలో అవనిగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా అవనిగడ్డ మండలంలో ఒకరు, ఘంటసాల మండలంలో ఒకరు, మోపిదేవి మండలంలో ఒకరు, చల్లపల్లి మండలంలో ఇద్దరు, కోడూరు మండలంలో ఇద్దరు, నాగాయలంక మండలంలో ముగ్గురు పాము కాటుకు మృతి చెందారు. కృష్ణాజిల్లా తీర ప్రాంతంలో సముద్రంలోంచి వివిధ రకాల పాములు గ్రామాల్లోకి ప్రవేశిస్తుంటాయి.రైతులు రైతు కూలీలు, పాఠశాల విద్యార్దులతో సహా పలువురు పాము కాట్లకు గురవుతున్నారు. మండలంలో పాముకాటు కేసులు పెరుగుతున్నప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అవసరమైన ఇంజక్షన్లు ఏర్పాటు చేయకపోవటం శోచనీయం.