‘అమ్మఒడి’కి 75శాతం హాజరు ఉంటేనే అర్హులు!

  • Published By: vamsi ,Published On : November 4, 2019 / 06:26 AM IST
‘అమ్మఒడి’కి 75శాతం హాజరు ఉంటేనే అర్హులు!

Updated On : November 4, 2019 / 6:26 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుని కేబినేట్‌లో ఆమోదం తెలిపిన పథకం అమ్మ ఒడి పథకం. ప్రతి సంవత్సరం పిల్లల తల్లులకు అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదివే వారి తల్లులు, వారి సంరక్షులకు ఈ పథకం డబ్బులు ఇవ్వనున్నారు.

2020 సంవత్సరం జనవరి 26వ తేదీ నుంచి అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఇక రెండు నెలలే ఉండడంతో పథకానికి సంబంధించి విదివిధానాలను రూపొందించేందు ప్రభుత్వం ఒక కమిటీ వెయ్యాలని భావిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదనే ఆశయంతో జగన్ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకాన్ని అందరికీ చేరువ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

అయితే అమ్మఒడి పథకానికి ఓ ప్రత్యేక నిబంధన పెట్టడం ద్వారా విద్యార్థుల హాజరు శాతాన్ని స్కూళ్లలో పెంచాలని నిర్ణయం తీసుకోబోతుందట. ఈ పథకానికి అర్హులు కావాలంటే డిసెంబర్ నెల వరకు స్కూలులో హాజరు శాతం 75శాతంగా ఉండాలంట.. ఒకవేళ అంతకంటే తగ్గితే ఎందుకు తగ్గింది అనే కారణం తెలుపుతూ మెడికల్ సర్టిఫికేట్ జత చేయాలట. జనవరి నెలలో ప్రతీ ఏడాది అమ్మ ఒడి పథకం అమలు చేస్తుండగా.. డిసెంబర్ వరకు హాజరును తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.

ఈ నిర్ణయాకి ప్రభుత్వ టీచర్లు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు.  అమ్మఒడి పథకానికి 75శాతం హాజరు అమలు చేస్తే..  విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందని అంటున్నారు. ఇక అమ్మఒడి పథకానికి గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తుంది ప్రభుత్వం. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా అమ్మఒడి పథకానికి సంబంధించిన వివరాలను సేకరించాలని ప్రభుత్వం భావిస్తుంది. అర్హత గల విద్యార్థుల తల్లి బ్యాంకు వివరాలను సేకరించి జనవరి 26వ తేదీన వారి ఖాతాలలో నగదు జమ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలోనే విద్యార్థికి తల్లి లేకపోతే తండ్రి బ్యాంకు ఖాతా వివరాలను తల్లి తండ్రి ఇద్దరూ లేకపోతే సంరక్షకుని బ్యాంకు ఖాతా వివరాలను సేకరించాలని వాలంటీర్లకు ఆదేశాలు ఇచ్చారట. ఇక ఈ పథకానికి అర్హత పొందాలంటే తెల్ల రేషన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డ్ వివరాలను కూడా రేషన్ కార్డ్ వివరాలతో పాటు విద్యార్ధుల స్టడీ సర్టిఫికేట్ తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివేవారికి, ఇంటర్మీడియట్ చదివేవారికి ఈ పథకం కింద డబ్బులు వస్తాయి.