ఆంధ్రా, ఆదానీల ఒప్పందం :70 వేల కోట్లతో విశాఖలో డేటా పార్క్

  • Published By: veegamteam ,Published On : January 10, 2019 / 09:49 AM IST
ఆంధ్రా, ఆదానీల ఒప్పందం :70 వేల కోట్లతో విశాఖలో డేటా పార్క్

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో మరో పారిశ్రామిక దిగ్గజం భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.70 వేల కోట్లతో డేటా, సోలార్‌ పార్క్‌ల ఏర్పాటుకు అదానీ గ్రూప్‌ ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, అదానీ గ్రూప్‌ మధ్య జనవరి 9న ఒప్పందం కుదుర్చుకున్న క్రమంలో సీఎం చంద్రబాబునాయుడు..ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌.. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతం అదానీల సమక్షంలో డేటా పార్క్ కు శ్రీకారం చుట్టారు. ఈ ఒప్పందంలో భాగంగా విశాఖలో పర్యావరణ హిత డేటా పార్క్‌ను ఏర్పాటు కానుంది. డేటా పార్క్ ఏర్పాటుతో 20 ఏళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రూ.70వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి మొదటి విడతగా 500 ఎకరాల విస్తీర్ణంలో ఒక గిగా వాట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుతో పాటు ఐదు గిగా వాట్స్‌ సోలార్‌ పార్క్‌ను కూడా నెలకొల్పనుంది. ఈ డేటా కేంద్రాన్ని ఇంటర్నెట్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌తో అనుసంధానించడం ద్వారా మెరుగైన అంతర్జాల సేవలు అందించే కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.  

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, హార్డ్‌వేర్‌ సప్లయర్స్‌, సాఫ్ట్‌వేర్‌, స్టార్టప్‌ కంపెనీలు, టెలీకాం కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని ఏపీ ఐటీ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో డేటా సెంటర్లు చెన్నై, ముంబయి నగరాల్లో మాత్రమే ఉన్నాయి. 2016 నాటికి దేశంలో డేటా సెంటర్ల రంగం విలువ 160 బిలియన్‌ డాలర్లు కాగా, ఇది ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే 2 శాతం మాత్రమే. ఏటా ఈ రంగంలో 20 శాతం పెరుగుదల నమోదవుతోంది. డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల దీనిపై ఆధారపడిన అనేక సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించడంతో వృద్ధి రేటు పెరుగుతుంది.