అనంత టీడీపీలో 9మందికి సీట్లు ఖరారు

  • Published By: vamsi ,Published On : March 7, 2019 / 05:32 AM IST
అనంత టీడీపీలో 9మందికి సీట్లు ఖరారు

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునే అనంతపురం జిల్లాలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేసింది తెలుగుదేశం. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పరిటాల సునీతకు ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు రాప్తాడును, కాలవ శ్రీనివాసులుకు రాయదుర్గంను అధినేత చంద్రబాబు కేటాయించారు. ఇక పెనుకొండ నుంచి బీకే పార్థసారథి, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్‌, ధర్మవరం నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ, అనంతపురం నుంచి వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, మడకశిర నుంచి ఈరన్న, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తుండగా.. 2019ఎన్నికల్లో వారికే మళ్లీ సీట్లను కేటాయించారు.

తాడిపత్రి నుంచి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థన మేరకు ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డికి సీటును కేటాయించారు. మిగిలిన వాటిలో కళ్యాణదుర్గం, పుట్టపర్తిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపుపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ రెండు సీట్లను హోల్డ్‌లో పెట్టారు. శింగనమల, కదిరి, గుంతకల్లు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు ఒక్కొక్కరితో విడివిడిగా అభిప్రాయాలు సేకరించారు. శింగనమల స్థానాన్ని సిట్టింగ్‌ ఎమ్మెల్యే యామినీబాల కోరుతున్నారు. గుంతకల్లు స్థానాన్ని కొత్తగా పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్తా ఆశిస్తుండగా పార్టీలో సీనియర్‌ నాయకుడు, బీసీ వర్గానికి చెందిన వెంకటశివుడు యాదవ్‌ తనకు అవకాశం కల్పించాలంటూ కోరుతున్నారు.

ఈ రెండు స్థానాలతో పాటు మరో మూడు స్థానాలను, హిందూపుర్ ఎంపీ స్థానానికి అభ్యర్ధులను కేటాయించలేదు. అనంతపురం ఎంపీ స్థానానికి జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి పేరు ఖరారు చేశారు. పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి హిందూపూర్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసే అవకాశం ఉండగా.. ఈ స్థానం నుండి పోటీ చేయాలని పరిటాల శ్రీరామ్ భావిస్తున్నారు. హిందూపురం సిట్టింగ్‌ ఎంపీ నిమ్మల కిష్టప్ప వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తుండడంతో అతనికి కేటాయించే సీటు విషయంలో క్లారిటీ రాలేదు.

రాప్తాడు- పరిటాల సునీత
రాయదుర్గం- కాలవ శ్రీనివాసులు
పెనుకొండ- బీకే పార్థసారథి
ఉరవకొండ- పయ్యావుల కేశవ్
ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ
అనంతపురం- వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, 
మడకశిర- ఈరన్న
హిందూపురం- నందమూరి బాలకృష్ణ
తాడిపత్రి- అస్మిత్‌రెడ్డి
అనంతపురం పార్లమెంటు: జేసీ పవన్ రెడ్డి