ఏపీ బడ్జెట్ : రూ.5వేల కోట్లతో అన్నదాత సుఖీభవ

ఏపీ బడ్జెట్ : రూ.5వేల కోట్లతో అన్నదాత సుఖీభవ

Updated On : February 5, 2019 / 6:19 AM IST

ఊహించినట్టుగానే ఎన్నికల వేళ ఏపీ సర్కార్ రైతాంగానికి బడ్జెట్ లో పెద్ద పీట వేసింది. అన్నదాతలను ప్రసన్నం చేసుకునేందుకు బడ్జెట్ లో భారీగా కేటాయింపులు ఇచ్చింది. 2లక్షల కోట్లతో బడ్జెట్ రూపొందించిన ప్రభుత్వం.. రైతుల కోసం కొత్త పథకం ప్రవేశపెట్టింది. ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం అందించనుంది. అన్నదాత సుఖీభవ పథకానికి రూ. 5 వేల కోట్లు కేటాయించారు.

 

అలాగే పలు కొత్త పథకాలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం సంక్షేమ పథకాలకు 65,486 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. రాజధాని అమరావతి వేదికగా వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసింది. వ్యవసాయ రంగానికి రూ.12వేల 732.97 కోట్లు కేటాయించింది.

 

2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో రైతులంతా పలు సమస్యలను ఎదుర్కొన్నారని..ఈ పదేళ్లలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిపోయే పరిస్ధితికొచ్చిందని సీఎం వాపోయారు. విత్తనాలు దొరక్క దిగుబడి తగ్గిపోయే దుస్ధితికి వ్యవసాయ రంగం వచ్చిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కోనసీమ రైతులు క్రాప్ హాలిడేను ప్రకటించారని ఇది చాలా దారుణమైన పరిస్థితి అని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకూడదని.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందుకే ఈ బడ్జెట్‌లో రైతులకు ప్రత్యేక బడ్జెట్‌ను తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.