వెంకన్న బంగారం తరలింపు : విచారణకు ఏపీ సీఎస్ ఆదేశాలు

  • Published By: madhu ,Published On : April 22, 2019 / 01:44 AM IST
వెంకన్న బంగారం తరలింపు : విచారణకు ఏపీ సీఎస్ ఆదేశాలు

Updated On : April 22, 2019 / 1:44 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానం బంగారం తరలింపులో భద్రతా లోపాలపై వస్తున్న వదంతులకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. టీటీడీ, విజిలెన్స్‌ అధికారులు బంగారం రవాణాలో సమర్థవంతంగా వ్యవహరించారా లేదా అనే దానిపై దర్యాప్తుకు సిద్ధమైంది. 1381 కిలోల బంగారం రవాణా వివాదంపై ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం విచారణకు ఆదేశించారు. ఇందుకోసం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ మన్మోహన్‌సింగ్‌ను విచారణాధికారిగా నియమించారు. ఈనెల 23వ తేదీలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే తిరుమలకు వెళ్లి విచారణ జరపాలని మన్మోహన్‌సింగ్‌ను సీఎస్‌ ఆదేశించారు. టీటీడీ బంగారం తరలింపులో భద్రతా లోపాలపై వస్తున్న వదంతులపై విచారణ చేయాలని, టీటీడీ విజిలెన్స్‌ అధికారులు సమర్థవంతంగా వ్యవహరించారా లేదా అనే దానిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సూచించారు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి  శ్రీవారికి చెందిన 1381 కిలోల నగలను చెన్నై నుంచి తిరుపతికి తీసుకొస్తుండగా ఈనెల 17న తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. ఆ నగలకు సంబంధించిన పత్రాలను బ్యాంకు అధికారులుగానీ.. టీటీడీ అధికారులుగానీ తరలింపు వాహనంలో ఉంచలేదు. దీంతో పోలీసులు అనుమానించి సీజ్‌ చేశారు. ఈ విషయంపై మీడియాలో కథనాలు రావడంతో  అటు బ్యాంకు అధికారులు, ఇటు టీటీడీ అధికారులు మేల్కొన్నారు.

టీటీడీ నగలకు చెందిన పత్రాలను తమిళనాడు పోలీసులకు చూపించిన నాలుగు రోజుల తర్వాత శనివారం తిరుపతికి తీసుకొచ్చారు. చీకటిపడ్డాక ఆ నగలను టీటీడీ పరిపాలనా భవనానికి తీసుకురావడం, కనీస భద్రత లేకుండా తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 400 కోట్ల విలువ చేసే బంగారం నలుగురు వ్యక్తులు తీసుకువెళ్లడం వెనక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కనీస భద్రత కూడా లేకుండా శ్రీవారి బంగారం తరలించడం ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తోంది. దీంతో టీటీడీ విజిలెన్స్‌ అధికారుల నిర్లక్ష్యంపై లోతుగా దర్యాప్తు  చేయడానికి సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.