జగన్ కు రాజకీయాల్లో ఉండే కేరక్టర్ లేదు : చంద్రబాబు

అమరావతి: తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ … రాష్ట్ర అభివృధ్దికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలో స్పృష్టంగా చెప్పామని, వైసీపీ మేనిఫెస్టోలో అవేమి లేవని అన్నారు. రాజధాని అభివృద్ధి గురించి, నదుల అనుసంధానం గురించి వైసీపీ మేనిఫెస్టో ప్రస్తావించలేదని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి అభివృద్ధి గురించి వైసీపీ మేనిఫెస్టోలో చెప్పలేదని, జిల్లాలు, మండలాల పారిశ్రామికీకరణపై జగన్ కు అవగాహన లేదని చంద్రబాబు తెలిపారు. “31 కేసులున్న వ్యక్తి విదేశాలకు ఎలా వెళ్తారని, నేరాలున్న వ్యక్తిని నమ్మి ఎవరైనా పెట్టుబడులు పెడతారా అని ప్రశ్నించారు. 97 మంది నేరగాళ్లను నిలబెట్టిన పార్టీకి ఎవరైనా ఓటు వేస్తారా” అని ఆయన ఎద్దేవా చేశారు.
“ఎవరైనా ఉద్యోగానికి వెళితే కేరక్టర్ సర్టిఫికెట్ చూస్తారు. ఉన్నత చదువులకు వెళ్లాలంటే కేరెక్టర్ సర్టిఫికెట్ అడుగుతారు. మరి రాజకీయాల్లో ఉండే కేరెక్టర్ సర్టిఫికెట్ జగన్ కు ఉందా..? జైళ్లకు వెళ్లినవాళ్లకు ప్రజా జీవితంలో ఉండే కేరెక్టర్ సర్టిఫికెట్ ఉంటుందా..? ” అని చంద్రబాబు ప్రశ్నించారు. తొలివిడత పోలింగ్ ప్రచారానికి గడువు మరో 3 రోజులు మాత్రమే సమయం ఉన్నందున వైసీపీ మరిన్ని అరాచకాలకు పాల్పడుతుందని , అందరూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నాయకులను ఎలర్ట్ చేశారు.”తొలి ఓటు నేరాలు-ఘోరాలు పార్టీకి వేస్తే క్షోభ తప్పదన్నారు”. టీడీపీ కార్యకర్తలు, నేతలపై తనకు అచంచల విశ్వాసం ఉందని చంద్రబాబు చెపుతూ…… ఫస్ట్ టైమ్ ఓటు వేసే ఓటర్లు టీడీపీ కే వేసేలా కృషి చేయాలని సూచించారు. ఈ ఎన్నిక రాష్ట్రానికే జీవన్మరణ సమస్య కావున, టిడిపి గెలుపును నాయకులు,కార్యకర్తలు ఛాలెంజ్ గా తీసుకుని పనిచేయాలని చంద్రబాబు కోరారు.