ఇకపై ఈ రెండు జగన్ ఫొటోలే వాడాలి: ప్రభుత్వం ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ సంక్షేమ పథకాల్లోనూ లబ్ధిధారులకు ఇచ్చే రేషన్ సరుకు బస్తాలపైన ఇలా ప్రతీదానిపై ముఖ్యమంత్రి ఫోటోను ప్రత్యేకంగా వేస్తుంటారు. ఈ క్రమంలో ఆయా శాఖలు ఇష్టం వచ్చినట్లుగా ముఖ్యమంత్రి ఫోటోలను వాడుతుండడంతో సీఎం కార్యాలయం నుంచి ఆయా శాఖలకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫొటోలను వాడవలసి వస్తే రెండు ఫోటోలను మాత్రమే వాడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం చేసినా, ఏ ప్రకటన వచ్చినా, ఏ వార్త రాసినా అందులో సీఎంకు సంబంధించిన ఈ రెండు ఫొటోలు మాత్రమే వాడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది సీఎం కార్యాలయం.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార మాసపత్రిక కవర్ పేజ్ మీద జగన్ ఫొటో బ్లాక్ అండ్ వైట్‌లో ప్రచురితం అయ్యింది. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేగగా ఆ పత్రికల ప్రచురణను ఆపేశారు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున చేపట్టే కార్యక్రమాల్లో జగన్ ఫొటోలతో కూడిన బ్యానర్లను ప్రభుత్వం తయారు చేయిస్తోంది. ఈ బ్యానర్‌లలో ఒకే ఫోటో కాకుండా ఎలా పడితే అలా వాడుతుండగా.. ఇప్పుడు జగన్ క్లారిటీ ఇచ్చారు.