సచివాలయ ఉద్యోగాలు: సెప్టెంబర్ 30న జగన్ చేతుల మీదుగా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన వారికి సెప్టెంబర్ 30వ తేదీన నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి నియామక పత్రాన్ని విజయవాడలో సీఎం జగన్ చేతుల మీదుగా అందజేస్తారు.
జిల్లాల్లో జిల్లాల ఎంపిక కమిటీ (డీఎస్సీ)ల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు.
సీఎం జగన్ నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత అక్కడ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలకు ఎంపికైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు జగన్. పదమూడు జిల్లాల్లో ఉద్యోగాలకు ఎంపికైనవారు సీఎం ప్రసంగాన్ని వీక్షించేలా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు అధికారులు. రాత పరీక్షల్లో ఉత్తీర్ణులై సెప్టెంబర్ 30 నాటికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తికాకుంటే వారికి వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే అక్కడికక్కడే నియామక పత్రాలు ఇస్తారు.
సచివాలయ వ్యవస్థకు తూర్పు గోదావరి జిల్లాలో అక్టోబర్ 2వ తేదీన ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అక్టోబర్ 2న కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప గ్రామంలో సచివాలయ భవనంను సీఎం ప్రారంభిస్తారు. ఆ రోజు నుంచే సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరుతారు.