నీ ఊరికొస్తా : కేసీఆర్‌కు బాబు హెచ్చరిక

ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా TDP అధినేత చంద్రబాబు తెలంగాణ సీఎం KCRపై గరంగరంగా ఉన్నారు. ఆయన్నే టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేస్తున్నారు బాబు. మార్చి 24వ తేదీన బాబు తెలుగు తమ్ముళ్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. అంతేగాకుండా పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తీరు మార్చుకోకుంటే హైదరాబాద్‌లో ఆందోళన చేస్తామని బాబు ఘాటుగా హెచ్చరించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీస్తున్న కేసీఆర్…టీడీపీ అభ్యర్థులను టీఆర్ఎస్ బెదిరిస్తోందని ఆరోపించారు. ఆయన చేస్తున్న పనులు తప్పని ఇప్పటికే స్పష్టం చేశామన్న బాబు..ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్‌లో నిరసనకు దిగే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు చంద్రబాబు.
మార్చి 24వ తేదీ ఆదివారం ప్రచారం నిర్వహించిన బాబు..జగన్‌పై మండిపడ్డారు. ఏపీకి తుపానులు, ఆర్థిక కష్టాల కంటే జగనే పెద్ద సమస్యని అభివర్ణించారు. ఈ సమస్యను వదలించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు బాబు. ఏపీలో ఏప్రిల్ 11వ తేదీన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీనితో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. టీఆర్ఎస్ – వైసీపీ జతకట్టాయని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ సందర్భంగా బాబు జగన్‌తో పాటు కేసీఆర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.