అమరావతి ఎడారి అన్నారుగా: అక్కడ ఆందోళన చేస్తే మీకేంటి అభ్యంతరం? : రైతుల ప్రశ్న

  • Published By: veegamteam ,Published On : December 23, 2019 / 04:33 AM IST
అమరావతి ఎడారి అన్నారుగా: అక్కడ ఆందోళన చేస్తే మీకేంటి అభ్యంతరం? : రైతుల ప్రశ్న

Updated On : December 23, 2019 / 4:33 AM IST

అమరావతి ఎడారి అన్నారుగా..మరి ఎడారిలో  తమ బాధను వెళ్లబోసుకుంటూ ఆందోళన చేపడితే  తమను అడ్డుకుంటారేంటి? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని రోడ్లపై రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. రోడ్లపై ధర్నాలు చేసేందుకు అనుమతులు లేవు..ఇక్కడ నుంచి వెళ్లిపోయండి అంటూ రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు పోలీసులలో వాగ్వాదానికి దిగారు. అమరావతిని ఎడారి అన్నారు. మరి ఎడారిలో ఆందోళన చేస్తుంటే మీరెందుకు అడ్డుకుంటున్నారు? అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు రైతులు.

రాష్ట్రానికి రాజధానిని ఎడారి అంటూ పాలకులు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని..కించపరుస్తున్నారని రైతులు వాపోయారు. తీవ్రంగా మండిపడ్డారు. ఇటువంటివారా రాష్ట్రాన్ని పరిపాలించేది? ఇటువంటివారా అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నత పదవులలో ఉండేది అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజధాని విలువ ఏంటో తెలిస్తే ఇలా మాట్లాడరనీ..వారి అవగాహనారాహిత్యానికి ఇటువంటి వ్యాఖ్యలే ఉదాహరణ అని రైతులు అంటున్నారు.  
 
ఏపీ రాజధాని రాజస్థాన్ ఎడారిలా ఉందని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపై అమరావతి ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని గ్రామ రైతులు ఈరోజు కూడా మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజధానిని అమరావతిలోనే ఉండాలని చేస్తున్న రైతుల నినాదాలతో అమరావతి ప్రాంతం దద్దరిల్లిపోతోంది. రోడ్లపై ధర్నా చేస్తున్న రైతులను పోలీసులు పక్కకు లాగేస్తున్నారు. ఈ క్రమంలో మందడంలోని రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

కాగా..ఏపికి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటించిన రోజు నుంచి అమరావతి ప్రాంతలోని 29 గ్రామాల రైతులు..మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే.