ఏపీ ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు : పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు

  • Published By: madhu ,Published On : September 28, 2019 / 03:44 AM IST
ఏపీ ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు : పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు

Updated On : September 28, 2019 / 3:44 AM IST

ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేసే కార్మికులకు దసరా కానుక అందిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. కార్మికులు, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచి..దానిని సెప్టెంబర్ నుంచే అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నెలలో రిటైర్మెంట్ చేసే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం నేపథ్యంలో..పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. 

సెప్టెంబర్ 04న ఏపీఎస్ ఆర్టీసీ విలీనంపై ఆంజనేయరెడ్డి కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. ప్రతి నెలా ఆర్టీసీలో 200 నుంచి 300 మంది వరకు ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నట్లు అంచనా. విలీన ప్రక్రియ పూర్తవడానికి ఇంకా మూడు నెలల గడువు ఉండడంతో ఆర్టీసీ ఉద్యోగులు తమకు 60 ఏళ్ల పెంపు వర్తించదని మదన పడ్డారు. ఈ విషయాన్ని విలీన కమిటీ ఛైర్మన్ ఆంజనేయరెడ్డి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ఆయన వెంటనే స్పందించి సెప్టెంబర్ నెల నుంచే 60 ఏళ్ల పెంపు వర్తింప చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది ప్రభుత్వం. 

సీఎం జగన్‌ అధ్యక్షతన ఇటీవలే సమావేశమైన మంత్రివర్గం ఆర్టీసీలో పదవీ విరమణ వయస్సులో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 ఏళ్ళు నుంచి 60 ఏళ్లకు పెంచింది.  దీంతో ఆర్టీసీలోని 53వేల మంది ఉద్యోగులకు లబ్ది  చేకూరుతుంది.
Read More : వారికి కోరుకున్న చోటు ఇళ్లు : సీఎం జగన్ ఆదేశాలు