సంక్రాంతి సందడి : పల్లెల్లో పందెం కోళ్ల దర్జాలు
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగకు కోడి పందేలు జోరుగా సాగుతాయి. జూదాలు, పేకాట నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగకు కోడి పందేలు జోరుగా సాగుతాయి. జూదాలు, పేకాట నిర్వహిస్తారు.
పశ్చిమగోదారి : ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగకు కోడి పందేలు జోరుగా సాగుతాయి. జూదాలు, పేకాట నిర్వహిస్తారు. సంక్రాంతికి ఎట్టిపరిస్థితుల్లోనూ కోడిపందేలు జరుగనివ్వబోమని అధికారులు చెబుతున్నారు. కోడి పందేలు, జూదాలు, పేకాట జరగకుండా నియంత్రిస్తామని చెబుతంటే మరోవైపు కోడి పందేల బరులు ఏర్పాటు జోరుగా సాగుతోంది. ఇక బరుల వద్ద భారీ ఎత్తున గుండాట, జూదాల నిర్వహణకు బేరసారాలు ప్రారంభమయ్యాయి. గతంలో డెల్టా ప్రాంతానికే పరిమితమైన కోడిపందేలు కొన్నేళ్లుగా జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా సాగుతున్నాయి. సంక్రాంతి సంస్కృతి పేరుతో నిర్వహిస్తున్న పందేల వెనుక పెద్ద ఎత్తున జూదాలు నిర్వహిస్తూ కోట్లు సంపాదిస్తు తున్నారు. బరుల వద్ద కోడి పందేలతోపాటు జూదాలు నిర్వహిస్తున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో గుండాట, పేకాట నిర్వహణకు డిమాండ్ ఏర్పడింది.
పాలకొల్లు నియోజవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించే కోడి పదేల బరి వద్ద గుండాట, పేకాట వంటి జూదాలు నిర్వహించుకోవడానికి రూ.50 లక్షలు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. భీమవరం ప్రాంతంలో పెద్ద బరి వద్ద రూ.70 లక్షలు ఇస్తామని పందేల నిర్వహకుల వద్ద జూదగాళ్లు బేరం కుదుర్చున్నట్లు సమాచారం. కోడి పందేలు, జూదాల వల్ల అనేక మంది పేదల జేబులు ఖాళీ చేసుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆస్తులు తాకట్టు పెట్టిన ఘటనలు అనేకం ఉన్నాయి. గతేడాది కోడి పందేల మాటున అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ భీమవరం మండలానికి చెందిన వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా పందేలు, జూదాలు విచ్చలవిడిగా జరిగిపోయాయి. డెల్టా ప్రాంతంలో భీమవరం, మండలంలోని పెదగరువు, దిరుసుమర్రు, వీరవాసరం మండలం కొణితివాడ, వీరవాసరం, పాలకొల్లు మండలం పూలపల్లి, చింతపర్రు, లంకలకోడేరు, యలమంచిలి, ఆకివీడు మండలం ఐ.భీమవరం, కాళ్ల మండలం జువ్వలపాలెం, పోడూరు, ఆచంట మండలాల్లో పెద్ద ఎత్తున పందేలు నిర్వహించారు. కోడికి కత్తికట్టకుండా పందేలు వేసుకోవచ్చని కోర్టు అనుమతి ఇచ్చిందనే ప్రచారంతో భారీగా బరులు నిర్వహంచారు. పేకాట, గుండాల వంటి జూదాలు యథేచ్ఛగా కొనసాగాయి. పందేల బరుల వద్ద జూదాల నిర్వహణకు పోటీ పెరగడంతో కొన్నిచోట్ల వేలం పాట నిర్వహిస్తున్నారు.
మద్యం అమ్మకాలు, కోడి పకోడి, పలావ్ వంటి తినుబండారాల అమ్మకాలకు కూడా బరుల నిర్వాహకులు పెద్ద మొత్తంలో సొమ్ములు వసులు చేస్తున్నారు. జూదాలు నిర్వహించేవారు. ముందుగానే కోడి పందేల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. జూదాల నిర్వహణకు లక్షలు ఇస్తామని ఆఫర్లు వస్తున్నా నిర్వహకుల మాత్రం వేచి చూసే ధోరణిలో వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. జూదాల నిర్వహకులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని బరుల వద్ద చోటు సంపాదించే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది.