బోటు ప్రమాదం : ఐదేళ్ల బాలిక మృతదేహం లభ్యం

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదం ఘటనలో కచ్చులూరు దగ్గర మరో మృతదేహం లభ్యం అయింది. ఘటనా స్థలానికి సమీపంలో ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం అధికారులు మృతదేహాన్ని దేవీపట్నం తరలించారు. మృతురాలు విశాఖకు చెందిన బాలికగా భావిస్తున్నారు. బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 36 మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్ 15, 2019) కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో బోటు ప్రమాదానికి గురైంది. బోటులో 61 మంది ప్రయాణికులతోపాటు 10 మంది సిబ్బంది ఉన్నారు.
బోటు వెలికితీతపై సస్పెన్స్ కొనసాగుతోంది. బోటును వెలికి తీసేందుకు ధర్మాడ సత్యం బృందం సిద్ధంగా ఉంది. కానీ గోదావరిలోకి వెళ్లేందుకు ధర్మాడ సత్యం టీమ్ కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. గోదావరి గర్భంలో 202 అడుగుల లోతులో ఉన్న బోటు వెలికితీత కష్టమంటున్నారు నిపుణులు. ప్రాణాలు రిస్క్ లో పెట్టొద్దంటూ ధర్మాడ సత్యం టీమ్ ను హెచ్చరిస్తున్నారు. కచ్చులూరు బోటు ప్రమాదంలో గల్లంతైన కుటుంబాల ఆశలు మెల్లగా సన్నగిల్లుతున్నాయి. తమ వారి ఆచూకీ దొరుకుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.
సోనార్ సిస్టమ్ తో 202 అడుగుల లోతులో బోటును గుర్తించారు. పైనతో పోల్చుకుంటే కింద నది ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆ లోతులో ఉష్ణోగ్రతలు కూడా మైనస్ డిగ్రీలో ఉంటాయి. వారికి ప్రాణ హాని కూడా ఉందని నిపుణుల బృందం చెప్పింది. నావీకి చెందిన డీప్ సీ డైవర్స్, ఎన్ డీఆర్ ఎఫ్ కు చెందిన డీప్ సీ డైవర్స్ వెళ్లడానికి నిరాకరించారు. వారు ఆక్సిజన్ తో వెళ్లడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఈక్రమంలో ధర్మాడ సత్యం టీమ్ ను బోటు వెలికితీతకు గోదావరిలోకి ఎలా పంపిస్తామని అధికారులు అంటున్నారు. వెళ్లేందుకు అనుమతివ్వడం లేదు. కానీ ధర్మాడ సత్యం టీమ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గతంలో ప్రమాదానికి గురైన బోటులను వెలికితీసిన ఘటనలు ఉన్నాయని అంటున్నారు.
అయితే బోటును వెలికితీయాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇంకా దాదాపు 15 మృతదేహాలు లభ్యం కావాల్సివుంది. మొదటి రోజు మృతదేహాలు కొట్టుకుపోయాయా లేదంటే బోటులోని ఏసీ క్యాబులోనే ఉన్నాయా అనేదానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. బోటును వెలికితీస్తే అందులో కచ్చితంగా పది మృతదేహాలు ఉంటాయన్న అంచనా ఉంది. బోటు ప్రమాదానికి గురైన ప్రాంతంలోనే ఇప్పటివరకు లభించిన మృతదేహాలు ఒక్కొక్కటిగా వెలికితీశారు. కాబట్టి బోటులోనే మిగిలిన మృతదేహాలు ఉంటాయని భావిస్తున్నారు.
బోటు ఉన్న ప్రాంతాన్ని ప్రాథమికంగా నిర్ధారించారు. బోటును వెలికితీస్తే తప్ప అందులో ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయనేది చెప్పలేము. బాధిత కుటుంబాల నుంచి అయితే ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతుంది. ఏడు రోజులైన కూడా మృతదేహాలను అప్పజెప్పకపోవడంపై కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికే బాధితుల బంధువులను కూడా అక్కడి వెళ్లకనివ్వకపోవడంతో ఏఎస్పీని బాధితుల కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.