కళతప్పిన బుడితి : పూర్వ వైభవం వచ్చేనా

ప్రపంచస్థాయిలో ఆ చేతి వృత్తి వారికి గుర్తింపు తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా నాణ్యతలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. కానీ.. ప్రస్తుతం ఈ అరుదైన చేతి వృత్తి అంతరించిపోయే పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం కరుణిస్తే.. మళ్లీ పూర్వ వైభవం సంపాదించుకునే వీలుంది. ఇంతకీ ఏమిటా చేతివృత్తి..? దానికెందుకంత ప్రాధాన్యం..? చదవండి.
శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి, చీడిపూడి, అవలింగి గ్రామాల్లో ఒకప్పుడు గృహోపకరణాలు, గృహాలంకరణ వస్తువులను ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేవి. ఇళ్లలో నిత్యం వాడుకునే కుండలు, చిన్నపాటి పాత్రలు దేశవ్యాప్తంగా ముఖ్య పట్టణాలకు హోల్‌సేల్‌గా తరలివెళ్లేవి. తాత ముత్తాతల నాటి నుంచి ఈ చేతి వృత్తిలో తర్ఫీదు పొందిన బుడితి వాసుల జీవితాలు కళకళలాడేవి. బుడితి ప్రాంతానికి వివిధ దేవతా విగ్రహాలు, ఆలయాలకు అవసరమైన కంచు డిజైన్లు, పాతకాలం నాటి ఇత్తడి పాత్రల తయారీలో ప్రత్యేకత ఉంది. దీనిపై అంతర్జాతీయ స్థాయి అవార్డులు సైతం ఇక్కడ కార్మికులు సొంతం చేసుకున్నారు. అలాంటిది ప్రస్తుతం సామగ్రి అమ్ముడు కాక.. పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. బతుకు జీవుడా అంటూ వలసబాట పడుతున్నారు.
ప్రస్తుతం పూట కూడా గడవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా కుటుంబాలు వలసబాట పట్టడంతో గ్రామంలో సగానికి పైగా ఇల్లు శిధిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వం ఆదుకుంటే తమ బతుకులు బాగుపడతాయని.. మళ్లీ బుడితి ప్రాంతానికి పూర్వవైభవం వస్తుందంటున్నారు ఇక్కడి వాసులు. సబ్సిడీ రుణాలు, పెన్షన్లు అందిస్తే మళ్లీ పరిశ్రమ పుంజుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకునే నాథుడే లేడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అరుదైన చేతివృత్తికి సాంకేతికత జోడించడంతోపాటు గృహాలంకరణ వస్తువుల తయారీ పట్ల ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిశ్రమ పురోభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తే బుడితి మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే వీలుంది. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే ఛాన్సుంది.