అది ప్రభుత్వ డేటా.. కేసీఆర్ తో కలిసి జగన్ కుట్ర : చంద్రబాబు

అమరావతి : తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అహంకారంతో కేసీఆర్.. ఫ్రస్టేషన్ తో జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యక్తికైనా.. సంస్థకైనా డేటా అనేది ఆస్తిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాంటి ఆస్తులకు హైదరాబాద్ లో రక్షణ లేకుండా పోతుందని ఆరోపించారు. పిల్ల చేష్టలతో హైదాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులు వస్తే తమ డేటాలను హైదరాబాద్ లో పెట్టేందుకు ఎవరైనా ముందుకొస్తారు అని ప్రశ్నించారు చంద్రబాబు. టీఆర్ ఎస్ పార్టీ విపరీత చేష్టలకు పాల్పడుతూ.. సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకుంటోందని విమర్శించారు చంద్రబాబు.
24 సంవ్సరాలు కష్టపడి రూపొందించుకున్న టీడీపీ డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసి.. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కు ఇచ్చిందని ఆరోపించారు. ఇది ప్రభుత్వ డేటా అని.. నేరం బైటపడిందనే అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు బాబు. ఏపీ డేటాను కొట్టేసి.. మనపైనే ఎదురు కేసులు పెడుతున్నారని విమర్శించారాయన. ఏపీతో కావాలని వివాదాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఏపీ ప్రజల డేటా చౌర్యం జరుగుతుందన్న ఆరోపణలతో ఇరు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మార్చి 4వ తేదీ సోమవారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో టిఆర్ఎస్, టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.