ఆత్మగౌరవం ఉన్నవాళ్లెవరూ కేసీఆర్ మద్దతు తీసుకోరు: చంద్రబాబు

పాయకరావుపేట: నరేంద్రమోడి ఏపీకి నమ్మక ద్రోహం చేశారని, ఏం మొహం పెట్టుకుని ఆయన మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. విశాఖజిల్లా పాయకరావు పేటలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మోడీ రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారని, రైల్వే జోన్ పేరుతో ఆంధ్రుల్ని అవమానించాడని చెప్పారు. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలని, ఇష్టానుసారంగా మాట్లాడితే వదిలి పెట్టబోనని కేసీఆర్ ,మోడీలను బాబు హెచ్చరించారు.
కియా మోటరు నేరంద్ర మోడీ తెచ్చాడని జగన్ అంటున్నాడని, మోడీ గుజరాత్ తీసుకుపోదామనుకుంటే నామీద నమ్మకంతో కియా మోటర్స్ రాష్ట్రానికి వచ్చిందని చంద్రబాబు చెప్పారు. కేసీఆర్ మనల్ని అవమానించాడు. మనం రాక్షసులమా, దోపిడీదారులమా…. తెలంగాణా ద్రోహులమా కేసీఆర్ ఇన్నిమాటలంటే మీకందరికీ కోపం వస్తుంది కానీ ఒకవ్యక్తికి కోపం రాదని… అతనే జగన్ మోహన్ రెడ్డి అని చంద్రబాబు చెప్పారు.
కేసీఆర్ మద్దతు తీసుకుంటే తప్పేంటని జగన్ అంటున్నారని, పౌరుషం ఉన్న వాళ్లెవరూ కేసీఆర్ మద్దతు తీసుకోరని, ఆంధ్రులు తెలంగాణకు బానిసలు కారని అన్నారు. కేసీఆర్ కు ఊడిగం చెయ్యాలనుకుంటే లోటస్ పాండ్ కు పోయి బాంచన్ నీకాల్మోక్కుతానని ఊడిగం చేసుకో అని జగన్ కు సూచించారు. బంగారు బాతు లాంటి హైదరాబాద్ ను వదిలేసి వచ్చాం అని రాష్ట్రంలో అమరావతిని హైదరాబాద్ లాగా డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు. అమరావతి డెవలప్ అయితే హైదరాబాద్ వెట్టి పోతుంది, విశాఖపట్నం డెవలప్ అయితే హైదరాబాద్ వెలవెల పోతుంది. అందుకని కేసీఆర్ తో కలిసి జగన్ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి సిటీలను 20 డెవలప్ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.