‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ : అక్కడికక్కడే సాయం చేసిన సీఎం జగన్

నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ ఎన్నికలకు ముందు అందరినీ ఆదుకునేందుకు భరోసా ఇచ్చిన వైఎస్ జగన్.. ఎన్నికల తర్వాత మాట ఇచ్చినట్లుగానే పాలనలో దూసుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తనముందుకు వచ్చిన సమస్యలకు వెంటనే పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరికైనా సాయం చేయాలంటే కూడా వెంటనే స్పందిస్తున్నారు. లేటెస్ట్ గా తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాలు ఇచ్చేందుకు వెళ్లిన జగన్.. అక్కడ ఓ కుటుంబం పడుతున్న బాధను తెలుసుకుని తీర్చారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన చాందినీ, రజనీ అనే ఇద్దరు అమ్మాయిలు తమ బాధ చెప్పుకుందామని రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. విమానాశ్రయం బయట ఏర్పాటు చేసిన గ్యాలరీలో సీఎం వైఎస్ జగన్‌కు ‘మా అన్నకు ప్రాణభిక్ష పెట్టండి’ అంటూ వేడుకునే ప్లకార్డులను పట్టుకుని ఉన్నారు. మా అన్న హరికృష్ణ.. తిరుపతి రవీంద్రభారతి స్కూల్‌లో 10వ తరగతి చవివేవాడు. 2015 నవంబర్ 21న స్కూల్ పైనుంచి కొంతమంది కిందకు తోసేశారు. మూడేళ్లపాటు కోమాలో ఉన్నాడు. చెన్నైలోని హాస్పిటల్ లో తొమ్మిది ఆపరేషన్లు చేశారు. చికిత్స కోసం రూ.10 లక్షలు ఆర్థిక సాయం కావాలి. అందుకు మీరు సాయం చేయండి అంటూ.. చాందిని, రజనీ సీఎంను అభ్యర్థించారు.
దీనిని చూసిన జగన్ వెంటనే అక్కడకు చేరకుని చిన్నారులతో మాట్లాడారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయి, మీ అన్నకు మేం ఉన్నాం… మేము కాపాడుతాం అంటూ.. చిన్నారుల అన్నయ్య వైద్యం కోసం తక్షణం రూ. 10 లక్షలను మంజూరు చేశారు. అలాగే ఇద్దరు చిన్నారుల చదువులు, కుటుంబం కోసం మరో ఐదు లక్షలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కష్టంతో వచ్చిన ఆ ఇద్దరు అక్కాచెలెళ్లను ఆదుకొని సీఎం జగన్ తన పెద్ద మనస్సు చాటుకోవడంతో అందరూ ప్రశంసిస్తున్నారు.