లక్ష్మీపార్వతికి కీలక పదవి ఇచ్చిన సీఎం జగన్

వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతికి సీఎం జగన్ కీలక పదవి ఇచ్చారు. నామినేటేడ్ పోస్ట్ అయిన తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా లక్ష్మీపార్వతిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీకి అందిస్తున్న సేవలకు గాను లక్ష్మీపార్వతికి ఈ పదవి దక్కిందని వైసీపీ నేతలు అన్నారు. లక్ష్మీపార్వతికి నామినేటేడ్ పదవి ఖాయమని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఆమెకు తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. లక్ష్మీపార్వతి వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబును విపరీతంగా వ్యతిరేకించే లక్ష్మీపార్వతి.. ఛాన్స్ వచ్చినప్పుడల్లా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేశ్‌లను టార్గెట్ చేశారు.
లక్ష్మీపార్వతి గతంలో సొంత పార్టీ పెట్టారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లక్ష్మీపార్వతికి సీఎం జగన్ ఎలాంటి పదవి ఇస్తారో అని రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. చివరికి.. లక్ష్మీపార్వతికి తగిన పదవిని జగన్ కట్టబెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వైసీపీ మహిళా నేతల్లో ముఖ్యులైన ఎమ్మెల్యే రోజా, వాసిరెడ్డి పద్మకు కూడా ఇదివరకే కీలక పదవులు కట్టబెట్టారు సీఎం జగన్. రోజాని ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా, వాసిరెడ్డి పద్మను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించిన విషయం తెలిసిందే. తెలుగు అకాడమీ చైర్ పర్సన్ పదవి దక్కడం పట్ల లక్ష్మీపార్వతి ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపారు.