వైయస్ఆర్ కంటి వెలుగు: జగన్ చేతుల మీదుగా ప్రారంభం

దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఏపీలో వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. అనంతపురం వేదికగా..అక్టోబర్ 10వ తేదీ గురువారం సీఎం జగన్ ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు చేసి.. వారి నేత్ర సమస్యలకు పరిష్కారం చూపడమే కంటివెలుగు పథకం ముఖ్యోద్దేశ్యం. ఈ ప్రతిష్టాత్మక పథకం ప్రారంభోత్సవానికి.. అనంతపురం వేదికవుతోంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో సీఎం జగన్ ఈ స్కీమ్‌ను లాంచ్ చేయనున్నారు. ఇందుకోసం.. జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
మంత్రి శంకరనారాయణ, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కలెక్టర్ సత్యనారాయణ సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం హోదాలో.. జగన్ తొలిసారి అనంతపురం వస్తుండటంతో.. వైసీపీ నేతలు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. అనంత రోడ్లన్నీ.. స్వాగత తోరణాలు, ప్లెక్సీలతో నింపేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో.. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు.
వైఎస్సార్ కంటివెలుగు పథకం తొలి విడతలో.. సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 16 వరకు.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌లో కంటి పరీక్షలు చేస్తారు. కంటి సమస్యలు ఎదుర్కొంటున్న స్టూడెంట్స్‌ను.. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు విజన్ సెంటర్లకు పంపిస్తారు. తర్వాత.. 3, 4, 5, 6 దశల్లో కమ్యూనిటీబేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెట్టనుంది ప్రభుత్వం.
కంటివెలుగు అమలుకు సంబంధించి.. కలెక్టర్ల నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీలు వేశారు.
ఇందులో భాగంగా.. 160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1415 మంది వైద్యాధికారులను నియమించారు. ఇప్పటికే అన్ని PHCలకు కంటి పరీక్షలకు సంబంధించిన కిట్లను పంపారు. 42 వేల మంది ఆశావర్కర్లు, 62 వేల మంది టీచర్లు, 14 వేల మంది ఏఎన్‌ఎంలు, 14 వేల మంది ప్రజారోగ్య సిబ్బంది.. కంటి వెలుగు పథకం అమలులో భాగస్వాములు కానున్నారు.
Read More : అసలేం జరిగింది : నెల్లూరు ఎమ్మెల్యేల అంతర్గత పోరుపై జగన్ సీరియస్