ఈసీ మార్క్ : కడప కొత్త ఎస్పీగా అభిషేక్ మహంతి

కడప : కడప జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఎస్పీగా అభిషేక్ మహంతిని నియమిస్తు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ ను హెడ్ ఆఫీస్ లో చేసుకోవాలని ఈసీ ఆదేశంతో రాహుల్ దేవ్ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేసారు. రిపోర్ట్ చేసిన వెంటనే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
2012 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన అభిషేక్ మహంతికి గతంలో కడప జిల్లాలో పని చేసిన అనుభవం కూడా ఉంది. 2018 నవంబర్ 2న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అభిషేక్ ఫిబ్రవరి 14 వరకూ పనిచేసి..గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ గా బదలీ అయ్యారు. ఈ క్రమంలో పలు కీలక పరిణామాల మధ్య తిరిగి ఆయన్నే ఎస్పీగా నియమించిన నేపథ్యంలో, రేపు ఆయన బాధ్యతలు స్వీకరించవచ్చని సమాచారం.
కాగా మాజీ ఎంపీ, వైఎస్ జగన్ బాబాయి అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతర పరిణామాలు.. వైకాపా నేతల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్నికల వేళ ఏపీలో పోలీస్ ఉన్నతాధికారుల బదిలీ వ్యవహారం వివాదంగా మారిన క్రమంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌తో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వీరు ఎన్నికల బాధ్యలకు దూరంగా ఉంచాలని ఆదేసించింది. ఈసీ తీరుతో అధికార తెలుగుదేశం పార్టీ మండి పడుతోంది. వైసీపీ, బీజేపీ కుట్రలో భాగంగానే పోలీసు ఉన్నధికారులు బదిలీలు జరుగుతున్నాయంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.