ప్రజాసేవ కోసం : ఎన్నికల బరిలో మాజీ ప్రభుత్వ ఉద్యోగులు

ఏపీ ఎన్నికల్లో ఈసారి మాజీ ఉద్యోగులు బరిలో నిలబడ్డారు. ఆయా పార్టీల్లో చేరి సీట్లు సంపాదించిన మాజీ ఉద్యోగుల జాబితా భారీగానే ఉంది. ఈ లిస్ట్‌లో జనసేన పార్టీ ముందు వరుసలో ఉంది. నిన్న మొన్నటి వరకు వివిధ ప్రభుత్వ హోదాల్లో విధులు నిర్వహించి ప్రజాసేవకు అంకితమవ్వాలని భావించిన ఉద్యోగులు .. ఆయా పార్టీల్లో చేరి అభ్యర్థులుగా నిలబడ్డారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో చాలామంది మాజీ ప్రభుత్వోద్యోగులు బరిలోకి దిగారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. అన్ని పార్టీలు ఇలా మాజీలకు అవకాశాలు ఇచ్చాయి. 20మందికి పైగా మాజీ ఉన్నతోద్యోగులు ఈసారి బరిలో ఉన్నారు. వీరిలో ముందుగా చెప్పుకోవలసింది సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. పదవికి రాజీనామా చేశాక సొంత పార్టీ ఆలోచన చేసిన ఆయన చివరకు జనసేనలో చేరారు. విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగారు. లక్ష్మీనారాయణతో పాటు మెట్ట రామారావు శ్రీకాకుళం లోక్‌సభ నుంచి, చింతల పార్థసారథి అనకాపల్లి లోక్‌సభ, భరత్ భూషణ్ వేమూరు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. మరో ఐఆర్ టీఎస్ మాజీ అధికారి, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, మాజీ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వీరితో పాటు మరికొంత మంది మాజీ ఉద్యోగులు జనసేన తరపున బరిలోకి దిగుతున్నారు.
ఐఏఎస్ అధికారి బి.రామాంజనేయులు టీడీపీలో చేరి కర్నూలు జిల్లా కోడుమూరు టిక్కెట్‌ను దక్కించుకున్నారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్‌గా, కలెక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన .. పదవీ విరమణ అనంతరం కూడా కొన్ని రోజులు సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రామాంజనేయులు అల్లుడు రాజేష్ .. 2009లో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. టీడీపీ బాపట్ల ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఆర్ఎస్ అధికారి మాల్యాద్రి బరిలో ఉన్నారు.
వైసీపీ కూడా కొందరు మాజీ అధికారులకు అవకాశం ఇచ్చింది. ఐజీ స్థాయిలో 2018లో పదవీ విరమణ చేసిన మహ్మద్ ఇక్బాల్ వైసీపీలో చేరి హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతానికి చెందిన ఇక్బాల్ రాయలసీమ ఐజీగా పనిచేశారు. పాఠశాలలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేయడంలో చూపిన శ్రద్ధ .. ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది. ఏపీ అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా పనిచేసిన అర్థూర్ నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.