డాక్టర్.. యాక్టర్.. హిట్లర్.. : పార్లమెంట్ గుర్తించిన ఓ ఫైటర్

నారమల్లి శివప్రసాద్. అతను ఒక డాక్టర్. పార్లమెంటు సభ్యుడు. అంతకు మించి ఆయన మంచి కళాకారుడు. అదే ఆయనకు రాజకీయాల్లోకి నడిపించి పేరు వచ్చేలా చేసింది. ఎంపీని చేసింది. ఢిల్లీకి పంపించింది. విభిన్నమైన నాయకుడిగా దేశంలో ప్రత్యేకమైన స్థానం తెచ్చిపెట్టింది. చిన్ననాటి స్నేహితుడు, పార్టీ అధినేత చంద్రబాబుకి అత్యంత నమ్మిన బంటు. అయితే ముక్కుసూటి మనిషి. ప్రజా సమస్యలను వినిపించడానికి ఆయన పార్లమెంటునే రంగస్థలంగా మార్చుకున్నారు. సమస్య తీవ్రతను బట్టీ, సమయానికి తగినట్లుగా విచిత్ర వేషాలతో పార్లమెంటుకు హాజరయ్యేవారు.
పద్యం, పాట, హరికథ, బుర్రకథ, బుడబుక్కల గలగల మాటలు.. తెలుగు కళారూపాలను పార్లమెంటు ద్వారా ప్రపంచానికి చూపిన విలక్షణ నాయకుడు శివప్రసాద్. ఎంతమంది నవ్వినా, ఎగతాళి చేసినా ఉన్న కళను రాజకీయాన్ని కలిపి రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల అంతరంగాలను దేశ వ్యాప్తం చేసేందుకు కృషి చేసిన పార్లమెంట్ ఫైటర్ శివ ప్రసాద్.
రాముడిగా.. కృష్ణుడిగా.. బేతాళుడుగా.. నారద మునిగా, సత్యసాయిబాబాగా, మెజీషియన్‌గా, హిట్లర్‌గా, స్కూల్ బాయ్‌గా, శిఖండిగా.. ఇలా అనేక వేషాలతో దేశ ప్రజలను ఆకట్టుకున్నారు. శివప్రసాద్ 1999-2004 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999-2001 మధ్య సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2009, 2014లో చిత్తూరు నుంచి టీడీపీ ఎంపీగా ఎన్నికయ్యారు. రోజుకొక వేషం వేసి కనిపిస్తూ ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో నిరసనలు తెలిపారు.