15 పూరిళ్లు దగ్ధం : సిక్కోలులో పేలిన గ్యాస్ సిలిండర్లు

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో కలకలం రేపింది. పాలకొండ పట్టణంలోని జగన్నాథ ఆలయ సమీపంలోని నక్కలపేటలో పూరిళ్లు వేసుకుని కొంతమంది నివాసం ఉంటున్నారు. వీరంతా కూలీలు. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం ఉపాధి హామీ పనుల నిమిత్తం పనులకు వెళ్లారు. అకస్మాత్తుగా రెండిళ్లలో గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. మంటలు ఇతర పూరిళ్లకు వ్యాపించాయి. 15 పూరిళ్లు మంటల్లో చిక్కుకున్నాయి.
తమ ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయని తెలుసుకుని లబోదిబోమంటూ అక్కడకు చేరుకున్నారు. నీళ్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే.. పూరిళ్లలో ఉన్న వస్తు, సామాగ్రీ మొత్తం కాలి బూడిదయ్యాయి. దీంతో వారు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.