చేనేతకు చేతనైన సాయం: మాట నిలబెట్టుకున్న జగన్

  • Published By: vamsi ,Published On : October 28, 2019 / 12:54 PM IST
చేనేతకు చేతనైన సాయం: మాట నిలబెట్టుకున్న జగన్

Updated On : October 28, 2019 / 12:54 PM IST

ఎన్నికలకు ముందు చేనేతలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. చేనేత రంగం అభివృద్ధి కోసం ‘వైఎస్ఆర్ చేనేత నేస్తం’ పేరుతో ఏటా రూ.24 వేల సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు.  అంతేకాదు చేనేత ఉత్పత్తులకు ప్రధాన సమస్యగా ఉన్న మార్కెటింగ్‌ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు నూతన పద్దతులను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు.

అలాగే దేశవిదేశాలకు కూడా మన చేనేత ఉత్పత్తులను పంపించేలా పటిష్టమైన మార్కెటింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చి తద్వారా చేనేత కార్మికుల ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేయాలని ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ధర్మవరం, ఉప్పాడ పట్టు, వెంకటగిరి చీరలు… యువతులు  మెచ్చే చేనేత డ్రస్‌ మెటీరియల్స్‌.. మగవారి హుందాతనం పెంచే చొక్కాలు, పంచెలు.. ఇలా నాణ్యమైన చేనేత ఉత్పత్తులను ఆన్‌లైన్‌ ద్వారా అమ్మించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మనసుకు నచ్చిన రంగులు, డిజైన్లను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసుకునేందుకు, చేయించేలా అమెజాన్, ఫ్లిప్‌కార్టు లాంటి ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంటుంది.

ఈ క్రమంలో చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసి ఆన్‌లైన్‌ ద్వారా అమ్మనుంది. ఇందులో భాగంగా తొలిదశలో 25 ఉత్పత్తులను అమెజాన్‌ ద్వారా నవంబర్‌ 1వ తేదీ నుంచి అమ్మనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే నవంబర్ చివరివారంలో ఫ్లిప్ కార్ట్‌లో దీనిని అందుబాటులోకి తీసుకుని రానున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ఆన్‌లైన్‌లో వస్త్రాల అమ్మకాలు జరగనున్నాయి.

తొలి దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాచూర్యం కలిగిన ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పెడన, పొందూరు, వెంకటగిరి, మాధవరం తదితర ప్రాంతాల్లో తయారయ్యే చేనేత వస్త్రాలను రూ. 500 నుంచి రూ. 20 వేల వరకు ధర నిర్ణయించి అందుబాటులోకి తీసుకుని రానున్నారు. వీటిలో ప్రధానంగా కాటన్, సిల్క్ చీరలు, డ్రస్‌ మెటీరియల్స్, చున్నీలు, చొక్కాలు, పంచెలు, బెడ్‌ షీట్లు, టవళ్లు, దిండు కవర్లు, లుంగీలు, చేతి రుమాళ్లు ఉండనున్నాయి.