ఫస్ట్ ప్లేస్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్.. నాల్గవ స్థానంలో టీఆర్ఎస్

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో చివరిదైన 7వ దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు కావడంతో ఈ ఎన్నికల్లో మొత్తం ఎంత మంది పోటీ చేస్తున్నారనే విషయం స్పష్టం అయింది. లోక్‌సభలోని 543 స్థానాలకు గాను రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 8,048 మంది పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలో వీరి సంఖ్య 8,794గా ఉంది. అయితే, వీరిలో 85 శాతం అంటే 6,819 మంది ఎన్నికలకు కొత్త వారే కావడం విశేషం.
ఈ ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల తరఫున మొత్తం 2,163 మంది బరిలో దిగారు. 2,445 మంది చిన్న చిన్న పార్టీల తరపున, 3,440 మంది ఇండిపెండెంట్లుగా ఎన్నికల బరిలో నిలిచారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఏ ఉద్యోగానికి అయినా క్వాలిఫికేషన్ కావాలి అనేది ముఖ్యమైన నిబంధన. అయితే రాజకీయాలకు మాత్రం అటువంటి నిబంధన లేదు. ఈసారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డిగ్రీ చదువుకుని ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఎక్కువగా ఉన్న పార్టీ దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ తరపున పోటీ చేసిన 88శాతం చదువుకున్న వారే కావటం విశేషం.
ఈసారి ఎన్నికల్లో పార్టీల పరంగా చదువుకున్న వ్యక్తులకు సీట్లు ఇచ్చిన పార్టీలో 88శాతంతో జగన్ పార్టీ YSR కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండగా.. 88 శాతంతోనే రెండో స్థానంలో తమిళనాడకు చెందిన డీఎంకే పార్టీ ఉంది. ఇక మూడో స్థానంలో తమిళనాడులోని అధికార పార్టీ ఏఐడీఎంకే ఉండగా.. నాల్గవ స్థానంలో 82 శాతంతో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఉంది. 5వ స్థానంలో 80శాతంతో నామ్ తమిళర్ కట్చి అనే పార్టీ ఉంది.
రాజకీయాల్లో మార్పు రావాలి, ఫిరాయింపులు ఉండకూడదు అంటూ మార్పును ప్రధాన ఎజెండాగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్.. అనుకున్నట్లుగానే చదువుకున్న వారికి అత్యధిక సీట్లు కేటాయించి.. దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలవటం విశేషం. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థుల వివరాలు, వారి క్వాలిఫికేషన్ ఈ జాబితాలో ఇవ్వలేదు.