మన్యంలో హై అలర్ట్ : మావోయిస్టు అగ్రనేతల కోసం కూంబింగ్

విశాఖ మన్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. మావోయిస్టు అగ్రనేతల కోసం పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. మూడు దళాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో మన్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు అక్కడి ఏజెన్సీ వాసులు. ప్రస్తుతం ఏజెన్సీలో ఒక యుద్ధవాతావరణం నెలకొందని చెప్పవచ్చు.
ఆంధ్రా – ఒడిషా సరిహద్దు వద్ద మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అరుణ, నవీన్, ఇతరులు మకాం వేశారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఇటీవలే జరిగిన ఎన్‌కౌంటర్ స్థలం నుండి పోలీసులకు కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా 15 రోజుల నుండి గిరిజనులతో మావోయిస్టులు సమావేశమవుతున్నారని పక్కా సమాచారం అందింది. అగ్రనేతలు, ఇతర మావోయిస్టులు పారిపోకుండా పోలీసులు పక్కా స్కెచ్ వేశారు.
మే 13వ తేదీ సోమవారం పోలీసులు భారీ స్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పలువురి గిరిజనులను అదుపులోకి తీసుకుని మావోయిస్టుల గురించి ప్రశ్నిస్తున్నారు. కూంబింగ్2తో ఏజెన్సీ ప్రాంతాలు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టులకు సహకరిస్తున్న ఇద్దరు హోం గార్డులు బాబురావు, నాగేశ్వరరావులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని సీలేరులో పట్టుకున్నారు.