74 ఏళ్ల బామ్మకు IVF చేయటం బుద్ధిలేని పని

గుంటూరులో 74 ఏళ్ల మంగాయమ్మ ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చిన అంశం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఐవీఎఫ్ పద్ధతిలో 74 ఏళ్ల మహిళ కవలలకు జన్మనివ్వడంపై ఇండియన్ ఫర్టిలిటీ సొసైటీ ఘాటుగా స్పందించింది. చట్టప్రకారం 18 సంవత్సరాల లోపు వయసున్న యువతులకు.. 45 సంవత్సరాలు దాటిన మహిళలకు కృత్రిమ గర్భధారణ చేయొద్దని తెలిపింది. నిబంధనలను తుంగలో తొక్కి టెక్నాలజీని దుర్వినియోగం చేశారంటూ గుంటూరు ఘటనపై ఐఎఫ్‌ఎస్ మండింది.
74 ఏళ్ల వృద్ధురాలికి ఐవీఎఫ్ చేయడం బుద్ధిలేని పని అన్న ఫర్టిలిటీ సొసైటీ.. డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటన విడుదల చేసింది. విలువలకు తిలోదకాలిచ్చి.. నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమ గర్భదారణ చేయొద్దని డాక్టర్లకు పిలుపునిచ్చింది ఐఎఫ్‌ఎస్. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని సూచించింది. కాగా…కృత్రిమ గర్భధారణ పద్ధతులలో పిల్లలను కనడం సాంకేతికంగా విప్లవమేనని అయితే 45 ఏళ్లు దాటిన మహిళలు అందుకోసం ప్రయత్నించడం చాలా ప్రమాదకరం అన్నారు ఫెర్టిలిటి స్పెషలిస్ట్. డాక్టర్ ప్రీతి. 45 ఏళ్లు దాటిన మహిళ ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం ధరిస్తే తల్లికి, పుట్టిన పిల్లలకు కూడా ప్రమాదకరమేని ఆమె చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962, మార్చి 22న వివాహమైంది. పెళ్లయి 57 ఏళ్లు గడిచినా సంతానం కలగలేదు. దీంతో గుంటూరులోని అహల్య నర్సింగ్‌హొమ్‌ను ఆశ్రయించారు. ఆస్పత్రి వర్గాలు ఆమె వయసును.. భవిష్యత్‌లో జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకోకుండా మంగాయమ్మకు ఐవీఎఫ్ చేశారు. గురువారం మంగాయమ్మకు సీజేరియన్ ఆపరేషన్ చేశారు. 74 ఏళ్ల వయసులో మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చింది. అయితే టెక్నాలజీని వైద్యులు దుర్వినియోగం చేశారని ఇండియన్ ఫర్టిలిటీ సొసైటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విలువలను మంటగలిపారని మండిపడింది.