ఆమెది గోదారి.. మనసు కూడా గోదారంత..: ఎందరికో స్ఫూర్తి.. మహాతల్లివమ్మా

  • Published By: vamsi ,Published On : April 15, 2020 / 10:54 AM IST
ఆమెది గోదారి.. మనసు కూడా గోదారంత..: ఎందరికో స్ఫూర్తి.. మహాతల్లివమ్మా

Updated On : April 15, 2020 / 10:54 AM IST

ఆమెది గోదారి జిల్లా.. ఆమె మనసు గోదారి ప్రవాహమంత.. అయితే ఆమె ఏదో సంపన్నురాలు కాదు.. సామాన్యురాలు.. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచమంతా కష్టపడుతున్న వేళ.. కష్టంలో ఉన్నవాళ్లకు సేవ చెయ్యాలని భావించడం అంటే మాములు విషయమా? అదే అమ్మతనం కదా? 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి సమీపంలో.. వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీసులు లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తుండగా.. రాత్రి, పగలు తేడా లేకుండా విధుల్లో బిజీగా ఉన్న పోలీసుల కోసం.. ఎండను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులను చూసి ఓ పేద మహిళ చలించిపోయింది. వారికి తనవంతుగా ఏదైనా సేవ చేయాలనుకుంది.

అనుకున్నదే తడవుగా.. రెండు పెద్ద కూల్‌డ్రింక్స్ బాటిల్స్ కొనుక్కొని తీసుకుని వెళ్లింది. విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అందజేసింది. ఆమె చేసిన పనికి పోలీసులు ఫిదా అయిపోయారు. ఆమె వివరాలను అడిగి తెలుసుకోగా.. నెలకు మూడున్నర వెయ్యి సంపాదించే మహిళ ఔదార్యానికి పొంగిపోయారు.

ఆ రెండు కూల్ డ్రింక్ బాటిళ్లు వెనక్కు ఇచ్చి.. తమ దగ్గర ఉన్న కూల్ డ్రింక్ బాటిళ్లను కూడా ఇచ్చారు.. పిల్లలకు ఇవ్వమని చెప్పారు. ‘నువ్వు నిజంగా మహాతల్లివమ్మా’ అంటూ పోలీసులు ప్రశసించారు. ఆమె ఆలోచించినట్లు జనాలందరూ ఇంట్లోనే ఉంటూ తమకు సహకరిస్తే చాలంటున్నారు. 

ఈ వీడియోను మాజీ మంత్రి నారా లోకేష్, సినీనటుడు మాధవన్ కూడా ట్వీట్ చేశారు.  ఆమె స్ఫూర్తి, గొప్ప మనసు వెలకట్టలేం.. కల్మషం లేని నవ్వు అంటూ మహిళపై ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.